అమీర్‌పేట, జనవరి 21 : ఇంట్లో జారి పడటంతో తలకు గాయమై.. మెదడులోని రక్తం గడ్డకట్టిన వందేళ్ల వృద్ధుడికి అత్యంత క్లిష్లమైన రెండు ఆపరేషన్లను కేవలం 24 గంటల వ్యవధిలోనే అమీర్‌పేట ఆస్టర్ ప్రైమ్ ఆస్పత్రి వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. రోగి కోలుకుని.. డిశ్చార్జి అవుతున్నాడని ఆస్పత్రి న్యూరో సర్జన్ డాక్టర్ మురళీకృష్ణ తెలిపారు. డాక్టర్ల కథనం ప్రకారం.. నగరానికి చెందిన వందేళ్ల వృద్ధుడు ఇటీవల తన ఇంట్లో జారి పడటంతో తలకు బలమైన గాయమైంది. మెదడులో రక్తం గడ్డ కట్టింది. ఈ పరిస్థితుల్లో ఆస్టర్ ప్రైమ్ ఆస్పత్రికి వచ్చిన వృద్ధుడికి వైద్యులు వెంటనే పరీక్షలు నిర్వహించగా, హైపర్‌టెన్షన్, డయాబెటీస్, డెనోవో హైపోథైరాయిడిజంతో బాధ పడుతున్నట్టు తేలింది.
అత్యంత క్లిష్టమైన ఈ పరిస్థితిని డాక్టర్ మురళీకృష్ణ వైద్య బృందం క్రానియోటమీ, ఎవాక్యుయేషన్ ఆఫ్ క్లాట్ అనే శస్త్ర చికిత్స విధానంలో పుర్రె తెరిచి.. మెదడు కవాట్లు, బ్లడ్ క్లాట్‌ను తొలగించారు. 24 గంటలు ఐసీయూలో చికిత్స పొందాడు. అపస్మారక స్థితిలోకి చేరుకున్న దశలో ధైర్యం చేసిన వైద్యులు డికంప్రెసివ్ క్రానియాక్టమి విధానంలో మరో శస్త్ర చికిత్సను చేసి, విజయవంతం చేశారు. రోగి త్వరగా కోలుకోవడంతో ఆదివారం డిశ్చార్జి చేశామని డాక్టర్ మురళీ కృష్ణ తెలిపారు.