చర్లపల్లి, డిసెంబర్ 8 : వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఈ సంఘటన కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. పోలీసుల కథనం ప్రకారం.. జనగాం జిల్లా పాలకుర్తి మండలం, బొమ్మెర గ్రామానికి చెందిన దేవసాని శ్రీహరి కుటుంబ సభ్యులతో కలిసి వైష్ణవి ఎన్క్లేవ్ వాసవి శివనగర్‌కు వచ్చి నివాసముంటున్నాడు. ఇతని కుమారుడు దేవసాని రామకృష్ణ(31) ఉప్పల్‌లోని స్టాక్ మార్కెట్లో పనిచేస్తున్నాడు.
ఈ నెల 7న తన స్నేహితుడికి సంబంధించిన ద్విచక్రవాహనం (టీఎస్08 హెచ్డీ 7968)పై బయటకు వెళ్లి తిరిగి వస్తుండగా కాప్రా కాల్ పబ్లిక్ స్కూల్ వద్ద అతివేగంగా దూసుకువచ్చిన ప్యాగో ఆటో (టీఎస్08 యూసీ 1845) బైక్‌ను ఢీకొట్టడంతో అతనికి తీ వ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు, వాహనదారులు అతడిని మెరుగైన చికిత్స కోసం ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. తలకు బలమైన గాయాలు కావడంతో వైద్యశాలలో చికిత్స పొందుతూ రామకృష్ణ మృతి చెందాడు. దీంతో పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
కాప్రా డివిజన్, సాయిబాబా ఆఫీసర్స్ కాలనీలో నివాసముండే నవనీతన్(48)ప్రైవేట్ ఉద్యోగి. ఆదివారం నవనీతన్.. బైక్(టీఎస్10 ఈయూ 6355)పై వస్తుండగా కాప్రా, నేతాజీనగర్ వద్ద అదుపు తప్పి కిందపడి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వాహనదారులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి అతడిని పరిశీలించగా మృతి చెంది ఉన్నాడు. ఈ మేరకు కుషాయిగూడ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.