కీసర, మే 4 : ఔటర్ రింగ్ రోడ్డుపై రెండు వాహనాలు ఢీకొని ఇద్దరు యువకులు మృతి చెందిన సంఘటన కీసర పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కీసర సీఐ శ్రీనివాస్ కథనం ప్రకారం.. ఆదివారం ఉదయం 11.30గంటల ప్రాంతంలో కీసర ఔటర్ రింగ్ రోడ్డు మీద కారు అతివేగంగా వస్తూ ముందున్న నైట్రోజన్ గ్యాస్ కాంటైనర్ను వెనుక నుంచి ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న చార్లెస్, యశ్వంత్‌లు మృతి చెందారు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలుకాగా అతనిని చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్‌లో ఘట్కేసర్లోని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ దవాఖానకు తరలించారు. ఈ కేసును కీసర పోలీసులు నమోదు చేసుకొని ధర్యాప్తు చేస్తున్నారు.