చాంద్రాయాణగుట్ట, డిసెంబర్ 3: గుర్తు తెలియని మాదకద్రవ్యాలను తీసుకున్న ఇద్దరు యువకులు అపస్మారక స్థితిలోకి వెళ్లి మృతిచెందిన ఘటన చాంద్రాయణగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పహాడీషరీఫ్, రెయిన్ బజార్ ప్రాంతాలకు చెందిన జహంగీర్ (24), ఇర్ఫాన్(25) ఆటో డ్రైవర్లు. బుధవారం తెల్లవారు జామున జహంగీర్, ఇర్ఫాన్ మరో స్నేహితుడితో కలిసి చాంద్రాయణగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలోని ఓ హోటల్ సమీపంలోని ఫ్లై ఓవర్ వద్దకు ఆటోలో చేరుకున్నారు.
అక్కడ ముగ్గురు కలిసి సిరంజీల ద్వారా గుర్తు తెలియని మత్తు మందులను తీసుకున్నారు. జహంగీర్, ఇర్ఫాన్ అపస్మారక స్థితిలోకి వెళ్లి.. ఆటోలోనే చనిపోయారు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. ఆటో సమీపంలో సిరంజీలు, ఇతర పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. మరణించిన వారితో వచ్చిన మరో స్నేహితుడు ఎవరనేది తెలుసుకునేందుకు పలు ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నట్లు ఏసీపీ సుధాకర్ తెలిపారు.