సిటీబ్యూరో, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ): ముంబాయి కేంద్రంగా నగరంలో డ్రగ్స్ దందా నడుపుతున్న ఇద్దరు నేరగాళ్లను ఆబ్కారీ ఎస్టీఎఫ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.2.75లక్షల విలువ చేసే 21గ్రాముల ఓజీ కుష్, 32.5 గ్రాముల చెరస్, 56 గ్రాముల ఎల్.ఎస్.డి బ్లాస్ట్‌లతో పాటు లక్ష రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఎస్టీఎఫ్ ఈఎస్ అంజిరెడ్డి కథనం ప్రకారం…బేగంపేట ప్రాంతానికి చెందిన తేజస్ కట్ట(29) అమెరికా పౌరసత్వం కలిగి ఉన్నాడు. భారత్‌కు వచ్చి కొంతకాలం ముంబాయిలో ఉంటూ అక్కడే ఉద్యోగం చేశాడు.
ఈ క్రమంలో తేజస్‌కు పలువురు డ్రగ్స్ వ్యాపారులతో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో తొలుత డ్రగ్స్‌కు బానిసగా మారిన నిందితుడు ఆ తరువాత డబ్బుకోసం డ్రగ్స్ వ్యాపారాన్ని ప్రారంభించాడు. ఈ క్రమంలో నగరానికి వచ్చిన తేజస్ కట్ట బేగంపేటలో నివాసముంటున్న రీగాక్స్ అనే కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో నగరానికి చెందిన సోహెల్ అహ్మద్(29)తో అతడికి పరిచయం ఏర్పడింది. ఇద్దరూ కలిసి డ్రగ్స్ తీసుకోవడమే కాకుండా డ్రగ్స్ వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నారు.
ప్రతి15 రోజులకు ఒకసారి, ఇద్దరు కలిసి ముంబైకి వెళ్లి చెరస్, ఎల్ఎస్డి బ్లాస్ట్, ఓజీ కుష్ ను తీసుకొచ్చి సన్‌సిటీలో అమ్మకాలు సాగిస్తున్నారు. ఈ మేరకు సమాచారం అందుకున్న ఎస్టీఫ్ పోలీసులు శనివారం నిందితులిద్దరిని పట్టుకుని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 2.75 లక్షల విలువ చేసే 21 గ్రాములు ఓజీ కుష్, 32.5 గ్రాములు చెరస్, 56 గ్రాముల ఎల్ఎస్డీ బ్లాస్ట్‌లతో పాటు లక్షరూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం కేసును శంషాబాద్ ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు. ఈ సందర్భంగా డ్రగ్స్ పట్టుకున్న సిబ్బందిని ఆబ్కారీ ఈడీ కమలాసన్‌రెడ్డి అభినందించారు.