వనస్థలిపురం, ఆగస్టు 2: రహదారిపై కారులో వెళ్తున్న ఓ వ్యక్తిని అటకాయించి, దారి దోపిడీ చేయడంతోపాటు, కారును కూడా లాక్కొని పారిపోయారు. ఈ ఘటన నగర శివారులో కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. నగరానికి చెందిన రాఘవేందర్‌రెడ్డి గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఇబ్రహీంపట్నం నుంచి నగరానికి తన కారులో వస్తున్నారు. అర్ధరాత్రి సమయంలో ఓ పల్సర్ బైక్‌పై ముగ్గురు వ్యక్తులు వచ్చి కారును అటకాయించారు.
ఆ తర్వాత బాధితుడి ఫోన్ లాక్కొని అందులోని ఫోన్‌పే నుంచి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. ఆ తర్వాత ఒకరు బైక్‌పై వెళ్లిపోగా, మరో ఇద్దరు బాధితుడి కారులో పారిపోయారు. దీంతో బాధితుడు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు, ఓ అంబులెన్స్ డ్రైవర్ కృష్ణ, బాధితుడు కలిసి నిందితుల కోసం గాలించారు. రాత్రి ఒంటి గంట సమయంలో కమ్మగూడ వద్ద నిందితులను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి బాధితుడి కారును స్వాధీనం చేసుకున్నారు.
నిందితులు బీఎన్ రెడ్డినగర్‌లోని విద్యా హాస్టల్లో ఉండే పొన్నాడ క్రాంతి(28), చింతల కుంట బజాజ్ ఎలక్ట్రానిక్స్‌లో పనిచేసే రావుల రాహుల్‌గా పోలీసులు గుర్తించారు. మరో నిందితుడు బీఎన్ రెడ్డినగర్‌కు చెందిన రోహిత్ పరారీలో ఉన్నాడు. నేరం జరిగిన ఒక గంట వ్యవధిలోనే కేసును ఛేదించిన పోలీసులను, అంబులెన్స్ డ్రైవర్‌ను రాచకొండ సీపీ సుధీర్‌బాబు, ఎల్బీనగర్ డీసీపీ ప్రవీణ్‌కుమార్ అభినందించారు.