Ponguleti Srinivas Reddy | మన్సురాబాద్, ఏప్రిల్ 12: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పీఏ అని చెప్పుకుంటూ ఇద్దరు వ్యక్తులు మోసాలకు తెగబడ్డారు. రాష్ట్రంలోని వివిధ ఆఫీసులు, పోలీసు అధికారులకు కాల్ చేసి తమకు అనుకూలంగా పనిచేయాలని ఒత్తిడి తీసుకొచ్చారు. అయితే వీరి తీరుపై అనుమానం వచ్చి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి డీపీవో పేరాల నరేశ్‌ను అధికారులు సంప్రదించడంతో అసలు బాగోతం బయటపడింది. ఈ క్రమంలో పేరాల నరేశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇద్దరు నిందితులను హైదరాబాద్ నాగోల్ పోలీసులు అరెస్టుచేశారు.
పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్ జిల్లా చిల్పూర్ మండలం పల్లగుట్ట గ్రామానికి చెందిన మాచ సురేశ్ (30) హైదరాబాద్‌లోని నాగోల్ వెంకటరెడ్డి నగర్ కాలనీలో నివాసం ఉంటూ క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కొంతకాలంగా 9030931213 మొబైల్ నంబర్ నుంచి పలువురు అధికారులకు కాల్ చేసి తనను తాను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పీఏనని పరిచయం చేసుకున్నాడు. తనకు కొన్ని పనులు చేసి పెట్టాలని కోరాడు. గత నెల 29న చౌటుప్పల్ సీఐకి ఫోన్ చేసి అనుమానాస్పదంగా మృతి చెందిన ఓ మహిళ పోస్టుమార్టం రిపోర్టు కావాలని కోరారు. నార్సింగి సీఐకి ఫోన్ చేసి సివిల్ కేసులో తమ వారికి అనుకూలంగా పనిచేయాలని అడిగాడు. సికింద్రాబాద్ రీజియన్ జేబీఎస్ పర్సనల్ ఆఫీసర్‌కు ఫోన్ చేసి ఓ డ్రైవర్ ట్రాన్స్ఫర్ విషయాన్ని డీల్ చేశాడు. అలాగే ఘట్కేసర్ ఎక్సైజ్ సీఐకి ఫోన్ చేసి గంజాయి కేసులో పట్టుబడిన వాహనాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాలేజీ సీటు విషయంలో జాహ్నవి డిగ్రీ కాలేజీ యాజమాన్యానికి, యూనియన్ బ్యాంక్ మేనేజర్‌కు ఫోన్‌చేసి 10 లక్షల పర్సనల్ లోన్ మంజూరు చేయాలన్నాడు. అయితే సురేశ్ ప్రవర్తనపై అనుమానం వచ్చిన సంబంధిత అధికారులు అతని వివరాలు సేకరించగా అసలు బాగోతం బయటపడింది. సురేశ్ అని ఎవరూ పొంగులేటి దగ్గర పీఏగా పనిచేయడం లేదని తేలింది.
భూపాలపల్లి జిల్లా చిట్యాలకు చెందిన బుస వెంకట్ రెడ్డి (30) హైదరాబాద్ నాగోల్‌లోని మమతా నగర్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. అతను కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పీఏనని చెప్పి పలు మోసాలకు పాల్పడ్డాడు. గోపాలపురం ఎస్సై, గోపాలపురం ట్రాఫిక్ సీఐ, భూపాలపల్లి సీఐ, ఉప్పల్ సీఐ, టపాచపుత్ర సీఐ, నాచారం సీఐ, పెద్దకొత్తపల్లి సీఐ, నాగోల్ సీఐ, ఘట్కేసర్ సీఐ, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే పీఏకి ఫోన్ చేసి పలు విషయాల్లో తమకు అనుకూలంగా వ్యవహరించాలని కోరాడు. అయితే బుస వెంకటరెడ్డిపై అనుమానం కలిగిన సంబంధిత అధికారులు.. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దగ్గర డీపీఓ (డేటా ప్రాసెసింగ్ ఆఫీసర్)గా పనిచేస్తున్న పేరాల నరేశ్‌కు సమాచారం అందించారు. ఈ క్రమంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పీఏలుగా చెప్పుకుంటూ మోసం చేస్తున్న మాచ సురేశ్, బుస వెంకట్ రెడ్డిపై నాగోలు పోలీసులకు డీపీవో పేరాల నరేశ్ ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.