మన్సూరాబాద్, జూన్ 15: ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధి సాగర్ రింగ్ రోడ్డు సమీపంలో దారుణం చోటు చేసుకున్నది. ఫుట్ పాత్ పై నిద్రిస్తున్న ఇద్దరు యాచకులపై 11 కేవీ వైర్లు తెగిపడడంతో ఇద్దరు యాచకులు నిద్రలోనే సజీవ దహనమయ్యారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం ఎల్బీనగర్లోని సాగర్ రింగ్ రోడ్ సమీపంలోని బాబాయి హోటల్ ఎదురుగా ఉన్న రేణుక ఎల్లమ్మ దేవాలయం ముందు ఫుట్‌పాత్‌పై ప్రతిరోజు ఇద్దరు యాచకులు(ఓ వ్యక్తి తో పాటు మహిళ) నిద్రిస్తుంటారు.
రోజూ మాదిరిగానే భిక్షాటన అనంతరం శనివారం రాత్రి ఇద్దరు రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయం వద్ద ఉన్న ఫుట్ పాత్ నిద్రిస్తున్నారు. అర్ధరాత్రి 1:50 సమయంలో పెద్ద శబ్దంతో 11 కేవీ విద్యుత్ వైరు తెగి ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న కుక్కపై పడ్డాయి. విద్యుత్ షాక్ ప్రభావంతో కుక్క ఎగిరి ఇంకొంత దూరంలో పడే సమయంలో అవే విద్యుత్ తీగలు పక్కనే నిద్రిస్తున్న గుర్తుతెలియని ఇద్దరు యాచకులపై పడ్డాయి. విద్యుత్ వైర్లు మీద పడడంతో కుక్కతో పాటు ఆ యాచకులిద్దరు అక్కడికక్కడే కాలిన గాయాలతో మృతి చెందారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాలను ఉస్మానియా దవాఖానకు తరలించారు. మృతులెవరనే విషయం ఇంకా తెలియరాలేదు.
కాగా, ఈ ప్రమాదంపై ఎలక్ట్రికల్ డీఈ రాజేందర్ నాయక్ ను వివరణ కోరగా గుర్తు తెలియని వాహనం సమీపంలోని విద్యుత్ స్తంభానికి ఢీకొట్టడం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలిపారు. వాహనం గుద్దిన తీవ్రతకు ఇన్సులేటర్ మెటల్ రాడ్ విరిగి విద్యుత్ వైర్లు తెగినట్లు భావిస్తున్నట్లు పేర్కొన్నారు. కానీ ఏ ప్రాంతంలో విద్యుత్ స్తంభానికి వాహనం ఢీ కొట్టిందో డిఈ స్పష్టం చేయలేకపోయారు. మరోవైపు విద్యుత్ స్తంభాలు ప్రమాదానికి గురైనట్లు ఎక్కడా కనిపించలేదని.. తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు విద్యుత్ అధికారులు ప్రయత్నిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఇద్దరు యాచకులు మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డి ఆదివారం ఉదయం సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 11 కేవీ విద్యుత్ వైర్లు తెగిపోవడం అంత సులువైన విషయం కాదని తెలిపారు. విద్యుత్ వైర్లు తెగి పడిన ఘటనలో ఇద్దరు యాచకులు మృతి చెందడం ఎంతో బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదానికి విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమా? లేక మరేదైనా కారణం ఉందా? అనే కోణంలో విచారణ చేపట్టాల్సి ఉందన్నారు.