Hyderabad | మన్సురాబాద్, జూన్ 15: ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధి సాగర్ రింగ్ రోడ్డు సమీపంలో దారుణం చోటు చేసుకుంది. ఫుట్పాత్ పై నిద్రిస్తున్న ఇద్దరు యాచకులపై చింతలకుంట ఫీడర్ కు సంబంధించిన 11 కేవీ వైర్లు తెగిపడ్డాయి. ఈ సంఘటనలో ఇద్దరు యాచకులతో పాటు ఒక కుక్క మృతి చెందింది.
పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. ఎల్బీనగర్, సాగర్ రింగ్ రోడ్ సమీపంలోని బాబాయి హోటల్ ఎదురుగా ఉన్న రేణుక ఎల్లమ్మ దేవాలయం ముందు ఫుట్పాత్ పై ప్రతిరోజు ఇద్దరు యాచకులు( ఓ వ్యక్తి తో పాటు మహిళ) నిద్రిస్తుంటారు. వారిద్దరూ భార్యాభర్తలు అయి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు. ప్రతిరోజు రోడ్లపై చెత్త కాగితాలను సేకరించి అమ్ముకోవడంతోపాటు భిక్షాటన చేస్తూ జీవితాన్ని గడుపుతున్నారు. రోజు మాదిరిగానే భిక్షాటన అనంతరం శనివారం రాత్రి సదరు మహిళ, వ్యక్తి ఇద్దరు రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయం వద్ద ఉన్న ఫుట్ పాత్ నిద్రిస్తున్నారు. అర్ధరాత్రి 1:50 గంటల సమయంలో పెద్ద శబ్దంతో 11 కేవీ విద్యుత్ వైరు తెగి రేణుక ఎల్లమ్మ తల్లి గుడి ఎదురుగా నిద్రిస్తున్న కుక్కపై మొదట పడి పోయాయి. విద్యుత్ షాక్ కు గురైన కుక్క ఎగిరి కొంత దూరంలో పడే సమయంలో… సదరు 11 కేవీ విద్యుత్ వైర్లు పక్కనే నిద్రిస్తున్న ఇద్దరు యాచకులపై పడ్డాయి. విద్యుత్ వైర్లు మీద పడటంతో ఇద్దరు అక్కడికక్కడే సజీవదహనం అయ్యారు.
అదే సమయంలో స్కూటీ పై అటు నుంచి వెళుతున్న ఓ వ్యక్తి విషయాన్ని గమనించి ఎల్బీనగర్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే అప్రమత్తమైన ఎల్బీనగర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఫైర్ సిబ్బంది, ఎలక్ట్రికల్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అప్పటికే ఇద్దరు యాచకులతోపాటు ఒక కుక్క ఈ సంఘటనలో మృతి చెందింది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు. మృతుల వివరాలను తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
గుర్తు తెలియని వాహనం విద్యుత్ స్తంభానికి ఢీకొట్టడం వల్లే ప్రమాదం: ఎలక్ట్రికల్ డీఈ, రాజేందర్ నాయక్
ప్రమాదం జరిగిన కొద్ది దూరంలో విద్యుత్ స్తంభానికి గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడం వల్లనే 11 కేవీ విద్యుత్ వైర్లు తెగి రోడ్డుపై పడ్డాయి. వాహనం గుద్దిన తీవ్రతకు ఇన్సులేటర్ మెటల్ రాడ్ విరిగి విద్యుత్ వైర్లు తెగినట్లు భావిస్తున్నాం. ఈ సంఘటనలో ఇద్దరు మృతి చెందడం దురదృష్టకరం. విద్యుత్ వైర్లు తెగడానికి మరి ఏమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలోనూ విచారణ చేస్తున్నాం.
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమా? లేక మరి ఏదైనా కారణమా తెలియాల్సి ఉంది: ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డి
సాగర్ రింగ్ రోడ్డు సమీపంలో 11 కేవీ విద్యుత్ వైర్లు తెగి పడి ఇద్దరు యాచకులు మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఆదివారం ఉదయం సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 11 కేవీ విద్యుత్ వైర్లు తెగిపోవడం అంత సులువైన విషయం కాదని అన్నారు. విద్యుత్ వైర్లు తెగి పడిన ఘటనలో ఇద్దరు యాచకులు మృతి చెందడం ఎంతో బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. ప్రమాదానికి విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమా.. లేక మరి ఏదైనా కారణం ఉందా అనే కోణంలో విచారణ చేపట్టాల్సి ఉందన్నారు. పరిస్థితులను చూస్తుంటే విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం ఉన్నట్లు కనిపిస్తుందని పేర్కొన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.