హైదరాబాద్: హైదరాబాద్ శివార్లలోని బాలాపూర్‌లో చిరుత పులుల సంచారం (Leopard) కలకలం సృష్టించింది. బాలాపూర్‌లోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్ (RCI)లో రెండు చిరుతలు తిరుగుతున్నాయని అధికారులు తెలిపారు. రెండు రోజుల క్రితం అక్కడ పనిచేసే వాచ్మెన్ చూశారని, అవి చిరుతపులుల్లా ఉండటంతో అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో ఆర్సీఐ లోపల అటవీ సిబ్బంది తనిఖీ చేపట్టినప్పటికీ వాటి జాడ కన్పించలేదు. ముందు జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలని ఉద్యోగులకు సూచించారు.
కాగా, ఆర్సీఐ ప్రాంగణంలో రెండు చిరుత పులులు తిరుగుతున్నాయన్న సమాచారంతో అప్రమత్తంగా ఉండాలని ఆర్సీఐలోని డిఫెన్స్ ల్యాబ్ స్కూల్ ప్రిన్సిపల్ విద్యార్థుల తల్లిదండ్రులకు నోటీసులు జారీచేశారు. పిల్లలను ఒంటరిగా బయటకు పంపించకూడదని తెలిపారు. కాగా, అవి చిరుత పులులా లేదా మరే ఇతర జంతువులా అనే తేల్చే పనిలో పోలీసులు, అటవీ అధికారులు నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగా ట్రాప్ కెమెరాలు, బోన్లు ఏర్పాటు చేశారు. పరిసర ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.