సిటీబ్యూరో, జనవరి 26 (నమస్తే తెలంగాణ): దక్షిణ డిస్కంలో జరుగుతున్న బదిలీల వ్యవహారాన్ని నిరసిస్తూ విద్యుత్ ఉద్యోగులకు సంబంధించి 21 యూనియన్లతో కూడిన రెండు జేఏసీలు పోరుబాట పట్టాయి. సుమారు ఆరువేల మంది ఉద్యోగులు ఆందోళనకు దిగడానికి సిద్ధమయ్యారు. సమయం కాని సమయంలో యాజమాన్యం అనాలోచిత నిర్ణయాలతో ఉద్యోగులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోకపోవడంతో డిస్కంలో పనిచేస్తున్న చిన్నాచితకా పెద్దా ఉద్యోగులంతా నిరసనగళం విప్పుతున్నారు.
డిస్కంలో ట్రాన్స్ఫర్లకు సంబంధించి ఈనెల 24 నుంచి 27వ తేదీ వరకు వెబ్ఆప్షన్లు ఇచ్చి ఉద్యోగులను దరఖాస్తు చేసుకోమని చెబుతూ యాజమాన్యం మార్గదర్శకాలు విడుదల చేసింది. 28న ఈ దరఖాస్తులను పరిశీలించి 29న ట్రాన్స్ఫర్లు ఇస్తామని, వెంటనే తమ పోస్టింగ్ ప్రాంతాల్లో జాయిన్ అవాలంటూ ఆ మార్గదర్శకాల్లో డిస్కం యాజమాన్యం పేర్కొంది. అయితే అసలు ట్రాన్స్ఫర్లు జరగాల్సిన సమయం ఇది కాదని, గత విధానాలకు భిన్నంగా టీజీఎస్పీడీసీఎల్ ఉన్నతాధికారులు తీసుకుంటున్న నిర్ణయాలు ఉద్యోగులకు శాపంగా మారాయని యూనియన్లు మండిపడుతున్నాయి. గతంలో ఉన్న విధానాలను సైతం డిస్కం యాజమాన్యం మార్చడం చర్చనీయాంశంగా మారింది.
బదిలీ ప్రక్రియలో లోపాలు..!
ఉద్యోగసంఘాలు- యూనియన్లతో చర్చించిన అనంతరమే బదిలీల మార్గదర్శకాలను ఖరారు చేయాలని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ(టీజీపీఈజేఏసీ), టీఈఈజేఏసీలు ప్రభుత్వాన్ని కోరుతూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు వినతిపత్రం ఇచ్చాయి. గతంలో ఎన్నడూ లేనట్లుగా నిబంధనలు విధిస్తున్నారని, సాధారణ బదిలీలు ఎప్పుడైనా మే, జూన్లలో జరుగుతాయని, కానీ జనవరిలో చేయడమనేది కేవలం కొంతమంది వ్యక్తుల స్వార్థపూరిత ప్రయోజనాల కోసమేననే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
బదిలీల మార్గదర్శకాల్లో బదిలీ నిషేధ సమయంలో క్రమశిక్షణ లేదా విజిలెన్స్ కారణాల వల్ల తప్ప ఎటువంటి బదిలీ ఉత్తర్వులు జారీ చేయబడవని పేర్కొన్నప్పటికీ మరి గత ఏడాది నవంబర్‌లో జరిగిన బదిలీలు ఏ ప్రాతిపదికన చేశారని విద్యుత్ ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. గత నవంబర్ బదిలీల్లో తప్పులు జరిగాయని, అందులో కొందరు ఉద్యోగులు ఇప్పటికీ విధుల్లో చేరలేదని డిస్కంలో చర్చ జరుగుతోంది. బదిలీల విషయంలో కొందరు సీఎండీని తప్పుదోవపట్టిస్తున్నారని, క్షేత్రస్థాయిలో ఉద్యోగుల సమస్యలను తెలుసుకుని వారితో సమన్వయం చేయాల్సిన యాజమాన్యమే సిబ్బందికి ఇబ్బంది కలిగేలా బదిలీ ప్రక్రియ చేపడితే తాము తప్పనిసరిగా నిరసనబాట పట్టాల్సి వస్తుందని జేఏసీ నేతలు హెచ్చరించారు.
యాజమాన్యం మాత్రం మొండివైఖరిని వీడడం లేదు. బదిలీలకు సంబంధించి డీఈ, ఎస్ఈలతో పాటు బదిలీల పర్యవేక్షణకు సంబంధించి సర్కిల్‌కు ఒక అధికారితో కూడిన కమిటీలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఉన్నతాధికారి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. యూనియన్లన్నీ రెండు జేఏసీలుగా తమ కార్యాచరణను ప్రకటించనున్నాయని, బుధవారం సీఎండీ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున నిరసన తెలిపేందుకు తాము సిద్ధమవుతున్నామని జేఏసీ ప్రతినిధులు తెలిపారు.

పరీక్షల సమయంలో బదిలీలా..!
ప్రస్తుతం విద్యార్థులకు పరీక్షల సమయం. చాలామంది ఉద్యోగుల పిల్లలకు మార్చి, ఏప్రిల్‌లలో పరీక్షలు జరుగుతాయి. ఈ సమయంలో తల్లిదండ్రులు పిల్లల పరీక్షలపై దృష్టిపెడతారు. కానీ ఈ సమయంలో టీజీఎస్పీడీసీఎల్లో బదిలీల ప్రక్రియ చేపట్టడం వివాదాస్పదమవుతోంది. అయితే ఇటీవల అన్ని యూనియన్లు, విద్యుత్ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సీఎండీ ముషారఫ్ నిర్వహించిన సమావేశంలో 2026 మే-జూన్ నెలల్లో సాధారణ బదిలీలు చేపట్టాలని ముందేచెప్పినట్లుగా చెప్పారు. అయినా బదిలీల ప్రక్రియ కొనసాగించడంపై జేఏసీలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం బదిలీలు చేపట్టినా పరీక్షల ముందు చాలామంది ఉద్యోగులు విధుల్లో చేరి సెలవులు పెట్టే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. ఇప్పటివరకు విద్యుత్ సంస్థల్లో బదిలీల కాలపరిమితి మూడేండ్లుగా ఉండేది కానీ ప్రస్తుతం దానిని రెండు సంవత్సరాలకే తగ్గించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.