సిటీబ్యూరో: రాజస్థాన్ నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్ రవాణా చేస్తున్న ఇద్దరు అంతర్రాష్ట్ర స్మగ్లర్లను పోలీసులు అరెస్ట్ చేసి.. వారి వద్ద నుంచి మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. రాచకొండ సీపీ సుధీర్‌బాబు వివరాలు వెల్లడించారు. రాజస్థాన్‌కు చెందిన ఓం రామ్ అలియాస్ ఓం ప్రకాశ్ , అతడి స్నేహితుడు సానవాల రామ్ లింగంపల్లిలో ఉంటున్నారు.
వీరిద్దరికీ డ్రగ్స్ అలవాటు ఉంది. మధ్యప్రదేశ్‌కు చెందిన ముకేశ్ వద్ద డ్రగ్స్ కొని హైదరాబాద్‌లో విక్రయించేందుకు ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా పోలీసులకు చిక్కకుండా ఉండేలా బస్సులు, లారీలు, ఆటోల్లో ప్రయాణించి హైదరాబాద్ శివారుకు చేరుకున్నారు. ఎస్ఓటీ ఎల్బీనగర్ డీసీపీ మురళీధర్ నేతృత్వంలోని బృందాలకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో జవహర్‌నగర్ పోలీసులతో కలిసి తిమ్మాయిపల్లి గ్రామ శివారులో ఓం ప్రకాశ్, రామ్‌ను పట్టుకున్నారు.