సిటీబ్యూరో, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగరానికి తలమానికమయ్యే ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టులు సందిగ్ధంలో పడ్డాయి. జేబీఎస్ నుంచి శామీర్‌పేట్, ప్యారడైజ్ నుంచి డెయిరీ ఫాం వరకు నిర్మించనున్న దాదాపు 18 కిలోమీటర్ల పొడవైన ప్రాజెక్టులకు భూసేకరణ ఇబ్బందులు తొలగడం లేదు. ఇప్పటికే సేకరించాల్సిన ఆస్తులకు మార్కింగ్ చేసి, అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. కానీ క్షేత్రస్థాయిలో ఎదురైతున్న వ్యతిరేకత ప్రాజెక్టును ముందుకు కదలకుండా నిలవరిస్తోంది.
రెండు జిల్లాల్లో ఆస్తుల సేకరణ..
ప్రాజెక్టుకు అవసరమైన ఆస్తుల సేకరణ ప్రక్రియ రెండు జిల్లాల పరిధిలో జరుగుతోంది. మేడ్చల్ మల్కాజిగిరి, హైదరాబాద్ జిల్లా యంత్రాంగం ఈ వ్యవహారాన్ని పర్యవేక్షిస్తున్నాయి. హైదరాబాద్ జిల్లా పరిధిలో ఉన్న ఆస్తుల సేకరణ హెచ్ఎండీఏకు తలనొప్పిగా మారింది. ఇప్పటికీ హైదరాబాద్ జిల్లా వాసులు ప్రాజెక్టు వెడల్పును 200 నుంచి 120-150 ఫీట్లకు తగ్గించాలని, పరిహారం విషయంలో స్పష్టమైన హామీ ఇస్తే తప్పా.. ప్రాజెక్టుకు భూములు ఇచ్చేది లేదని తేల్చి చెబుతున్నారు.
ప్రాజెక్టు ద్వారా భూములు కోల్పోయే యజమానులతో గ్రామ సభలకు ఏర్పాటు చేసినా.. ప్రాజెక్టు వెడల్పు విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఇప్పటివరకు జరిగిన సమావేశాలకు స్థానికులు దూరంగా ఉంటున్నారు. ఇదే సమయంలో అభ్యంతరాలు వ్యక్తం చేస్తూనే వందలాది మంది బాధితులు కోర్టును ఆశ్రయించారు. ఇక హైదరాబాద్ జిల్లా పరిధిలో రెండు మార్గాల్లో 500కు పైగా మంది తమ ఆస్తులను కోల్పోతుండగా… ఇప్పటికీ 10శాతం కూడా పూర్తి కాలేదని తెలిసింది. ఈ జాప్యానికి భూసేకరణ అధికారులు తీవ్ర అసహనంతో ఉన్నారు.
కార్యరూపంలోకి రాని ప్రణాళికలు..
నార్త్ సిటీకి అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నా… ప్రాజెక్టు భూసేకరణ విషయంలో ప్రజాభిప్రాయానికి ప్రభుత్వం ప్రాధాన్యతనివ్వడం లేదనే విమర్శలు ఉన్నాయి. దీంతోనే ప్రాజెక్టు శంకుస్థాపన చేసి ఏడాది గడిచినా.. ప్రాజెక్టును పట్టాలెక్కించడంలో విఫలమయ్యారు.ప్రాజెక్టుకు డిఫెన్స్ శాఖ నుంచి భూములను తామే సేకరించామని గొప్పలు చెప్పుకుంటున్నారే తప్పా.. భూసేకరణ పూర్తి చేయడంలో విఫలం అవుతున్నారు.
దీంతో దాదాపు 18 కిలోమీటర్ల మేర రెండు ప్రధాన మార్గాల్లో నిర్మించనున్న ఎలివేటెడ్ కారిడార్ల డిజైన్లు ఖరారైన, ప్రణాళికలను అమలు చేయడంలో హెచ్ఎండీఏ ముందుకు వెళ్లడం లేదు. ఈ రెండు ప్రాజెక్టులు ప్యాట్నీ నుంచి తూంకుంట వరకు వెస్ట్ మారేడ్‌పల్లి, కర్ఖానా, తిరుమలగిరి, బొల్లారం, ఆల్వాల్, హకీంపేట్ మీదుగా తూంకుంట వరకు ఉండే 12 కిలోమీటర్లు, ప్యారడైజ్ నుంచి డెయిరీ ఫాం(దూలపల్లి)వరకు 5.5 కిలోమీటర్ల మేర ఎలివేటెడ్ కారిడార్‌ను హెచ్ఎండీఏ నిర్మించనుంది.