మన్సురాబాద్, మార్చి 3 : మద్యం సేవించి బైక్ నడుపుతూ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులో నాలుగోసారి పట్టుబడిన ఓ వ్యక్తికి కోర్టు రెండు రోజుల జైలు శిక్ష విధించింది. హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది.
ట్రాఫిక్ పోలీసుల కథనం ప్రకారం.. ఎల్బీనగర్ ట్రాఫిక్ పోలీసులు గత నెల 24న డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తుండగా మద్యం సేవించి బైక్ నడుపుతూ సింగరేణి కాలనీకి చెందిన ఎం. జగదీశ్(35) పట్టుబడ్డాడు. మద్యం సేవించి వాహనం నడుపుతూ నాలుగోసారి డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన జగదీశ్ కోర్టుకు హాజరుకాకుండా నాటి నుంచి తప్పించుకుని తిరుగుతున్నాడు. తప్పించుకు తిరుగుతున్న జగదీశ్‌ను సోమవారం పోలీసులు అదుపులోకి తీసుకొని ఎల్బీనగర్లోని ఆరో ప్రత్యేక మెట్రోపాలిటన్ న్యాయస్థానం జడ్జి ముందు హాజరపరిచారు. మందు బాబు జగదీశ్‌కు రెండు రోజుల జైలు శిక్ష విధించారని ఎల్బీనగర్ ట్రాఫిక్ సీఐ దొంగరి వెంకటేశ్వర్లు తెలిపారు.
ఈ సందర్భంగా ట్రాఫిక్ సీఐ మాట్లాడుతూ.. ఫిబ్రవరి నెలలో జరిపిన డ్రంక్ అండ్ డ్రైవ్ లో 440 మంది మద్యం తాగి వాహనాలు నడుపుతూ పోలీసులకు పట్టుబడ్డారని తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యల కోసం న్యాయస్థానంలో హాజరుపరిచారు. వారిలో 5 మందికి ట్రాఫిక్ డ్యూటీ, ఇద్దరికీ రెండు రోజుల చొప్పున జైలు శిక్ష విధించారని పేర్కొన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వారికి రూ. 6,37,800 లక్షల జరిమానా విధించడం జరిగిందన్నారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతూ ప్రాణాలు కోల్పోవడం, ప్రమాదాల బారిన పడడమే కాకుండా కుటుంబాలకు శిక్ష వేసిన వారు అవుతున్నారని తెలిపారు. మద్యం సేవించి వాహనాల నడుపుతూ పట్టుపడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.