Accidents | సిటీబ్యూరో, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ): వరుస రోడ్డు ప్రమాదాలతో హైదరాబాద్-బీజాపూర్ రహదారిలో భాగమైన చేవెళ్ల -వికారాబాద్ రహదారి నెత్తురోడుతోంది. చేవెళ్ల ఆలూరు గేట్ సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దంపతులు దుర్మరణం చెంది 24గంటలు గడవకముందే సోమవారం సాయంత్రం ఆలూరు స్టేజి వద్ద లారీ బీభత్సం సృష్టించిన మరో ఘటనలో స్థానికంగా కూరగాయలు విక్రయించే నలుగురు రైతులు దుర్మరణం చెం దారు.
అయితే లారీడ్రైవర్ల అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్లనే ఇక్కడ వరుస ఘటనలు జరుగుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. అంతే కాకుండా నిత్యం పదుల సంఖ్యలో భారీ వాహనాలు ప్రయాణించే హైదరాబాద్ – భీజాపూర్ రహదారి చిన్నపాటి గల్లీ రోడ్డులా ఇరుకుగా, మలుపులు తిరిగి ఉండడం కూడా ఇక్కడ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు కారణంగా తెలుస్తోంది. దీనికి తోడు చాలా మంది లారీ డ్రైవర్లు నిద్రమత్తులో, మరికొందరు మద్యం మత్తులో కూడా ఉంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కారణాలేవైనా వరుసగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో 24గంటల్లోనే 6మంది దుర్మరణం చెందడం స్థానికులను కలిచివేస్తోంది.
నిత్యం భారీ వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే ఈ రహదారి విస్తరణ పనులు చాలా కాలంగా పెండింగ్లో ఉన్నాయి. హైదరాబాద్- భీజాపూర్ ప్రధాన రహదారి సింగిల్ రోడ్డు కావడం, ఒక వీధి రోడ్డులా ఇరుకుగా ఉండడంతోపాటు చాలా చోట్ల ప్రమాదకరమైన మలుపులు ఉండడం, రోడ్డుపై ఎలాంటి సైన్బోర్డులుగానీ, రోడ్డుకు ఇరువైపులా తెలుపురంగు లేన్గానీ లేకపోవడం కూడా ఈ ప్రమాదాలకు ఆజ్యం పోస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. రాత్రి సమయంలో అయితే ఇక్కడి పరిస్థితి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
చుట్టు పక్క గ్రామాలవారు ఏదైన పనులమీద ద్విచక్రవాహనాలపై వెళ్లాలంటే ప్రాణాలను అరచేతిలో పెట్టుకోవాల్సిందే. ఈ రహదారిపై గతంలో కూడా ఘోర రోడ్డు ప్రమాదాలు జరిగినా అధికారులు పట్టించుకున్న పా పాన పోలేదని వాపోతున్నారు స్థానికులు. ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న ఈ రోడ్డు విస్తరణ పనులను ఇప్పటికైన ప్రారంభించాలని స్థానిక ప్రజలు, వాహనదారులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.