సిటీబ్యూరో, మార్చి 31(నమస్తే తెలంగాణ) : ఒక్క ప్రాజెక్టుపై రెండు విరుద్ధమైన ప్రకటనలు ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు చేపట్టిన పనుల పురోగతిపై అనుమానాలు కలిగిస్తున్నాయి. హెచ్ఎండీఏ చేపట్టిన ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టు పనుల పురోగతిపై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలకు, అసలు క్షేత్రస్థాయిలో పొంతన లేకుండా పోతున్నది. అనుమతులే రాని ప్రాజెక్టు పనులు సాగుతున్నాయని అసెంబ్లీ వేదికగా చెప్పడమే అసలు చర్చకు కారణమైంది. వాస్తవానికి అనుమతులు కూడా పూర్తి కానీ ప్రాజెక్టు పనులు సాగుతున్నాయని చెప్పడంతో గందరగోళానికి తెరలేపింది. హెచ్ఎండీఏ చేపట్టిన ప్యారడైజ్ నుంచి సుచిత్ర మార్గంలో నిర్మించే ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టు ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశంగా మారింది. రెండేండ్ల పాలనలో చేపట్టిన ఏ ఒక్క ప్రాజెక్టు కూడా ముందుకు పడనీ నేపథ్యంలో.. వాస్తవాలను కప్పి పుచ్చి సర్కారు బుకాయిస్తుందనే ఉన్న ఆరోపణలకు ఇదొక ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచేలా ఉంది.
ఒక్క ఇంచూ భూసేకరణ జరగలే
ప్రతిష్టాత్మక ప్రాజెక్టు రెండేండ్ల కిందట సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆల్వాల్ టిమ్స్ సమీపంలో శంకుస్థాపన చేశారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్క ఇంచు కూడా భూసేకరణ జరగలేదు. హద్దులు గుర్తించి, ప్రైవేటు ఆస్తుల కోసం ఎదురుచూస్తున్నారు. కానీ టెండర్లు మాత్రం పూర్తి చేశారు. ఇదే సమయంలో మార్చి 24న అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నగరాభివృద్ధిపై మాట్లాడుతూ… “ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టు పనులు సాగుతున్నాయి. బేగంపేట్ ఎయిర్‌పోర్టు కింద నుంచి అండర్ గ్రౌండ్ టన్నెల్ పనులు సాగుతున్నాయి. ఎయిర్‌పోర్టు ఆథారిటీ ఆఫ్ ఇండియా అనుమతులు కూడా వచ్చాయి.” అని అన్నారు. కానీ క్షేత్రస్థాయిలో అందుకు భిన్నమైన పరిస్థితులే ఉన్నాయని స్పష్టం అవుతున్నది.
ప్రతిపాదిత అండర్ గ్రౌండ్ టన్నెల్ అలైన్మెంట్ మాత్రమే గతేడాదిలో ఖరారు చేశారు. దానికి అనుగుణంగా హద్దుల నిర్ధారణ చేశారు. కానీ టన్నెల్ కోసం ఎక్కడా తవ్వినట్లు ఆనవాళ్లు కనిపించడం లేదు. నిజానికి ఈ ప్రాజెక్టు విషయంలో హెచ్ఎండీఏ ఇంజినీరింగ్ విభాగం ఉన్నతాధికారులు మాట్లాడుతూ.. ‘కీలకమైన అనుమతులు ఎయిర్‌పోర్టు ఆథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. ఈ అంశంలో ఆ సంస్థతో సంప్రదింపులు చేస్తున్నాం. కానీ ఇప్పటివరకు స్పందన లేదు. ఒకసారి హెచ్ఎండీఏకు భూములు బదలాయింపును ఎయిర్‌పోర్టు అథారిటీ బోర్డు ఆమోదించాల్సి ఉంది. ఆ తర్వాతే అనుమతులు వస్తాయి’ అని పేర్కొన్నారు. కానీ సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం ప్రాజెక్టులో కీలకమైన టన్నెల్ పనులు మొదలుపెట్టామంటూ ప్రకటించడంతో.. ఇక్కడ చెబుతున్న మాటలకు, జరుగుతున్న పనులకు పొంతన లేకుండా పోయిందన్నారు.
ఎయిర్‌పోర్టు కింద 600 మీటర్ల టన్నెల్
ప్యారడైజ్-సుచిత్ర మార్గంలో నిర్మించే ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టుకు 2024లోనే సూత్రప్రాయ అనుమతులను కేంద్ర రక్షణ శాఖ అనుమతులిచ్చింది. జాతీయ రహదారి 44పై నిర్మించే ఈ ప్రాజెక్టులో భాగంగా 60 మీటర్ల వెడల్పుతో 600 మీటర్ల టన్నెల్‌కు సన్నాహాలు చేశారు. అన్నా నగర్ జంక్షన్ సమీపం నుంచి ఈ టన్నెల్ మొదలు కానుండగా..సివిల్ ఏవియేషన్ శాఖ నుంచి ఎన్వోసీ తీసుకోవాల్సి ఉంది. కానీ సర్కారు మాత్రం ఈ ప్రాజెక్టు పనులు మొదలుపెట్టామని చెప్పుకుంటోంది.