Road Accident | మెహిదీపట్నం: మద్యం మత్తు ఆపై అతివేగం.. అదుపు తప్పిన కారు.. విధ్వంసం సృష్టించింది. ఓ కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చింది. ఇంటి నుంచి పిల్లల కోసం ఆహారం తెద్దామని బయటకు వచ్చిన దంపతులు దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదంలో మరో నలుగురికి గాయాలయ్యాయి. లంగర్‌హౌస్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గోల్కొండ ఏసీపీ సయ్యద్ ఫయాజ్ తెలిపిన వివరాల ప్రకారం.. లంగర్‌హౌస్ నుంచి మెహిదీపట్నం వైపు వేగంగా వెళ్తున్న కారు.. దర్గా సమీపంలోకి రాగానే అదుపు తప్పి మూడు బైక్‌లను, ఆటోను ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో లంగర్‌హౌస్ గొల్లబస్తీలో నివసించే దినేశ్(35), అనితా ఠాకూర్ (35) దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురికి గాయాలయ్యాయి. లంగర్‌హౌస్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను మార్చురీ తరలించారు. ఆదివారం పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. కాగా, లంగర్‌హౌస్ గొల్లబస్తీలో నివసించే అనితా ఠాకూర్, దినేశ్ దంపతులు తమ ఇద్దరు పిల్లలు ప్రేరణ శ్రీ(12), దితి శ్రీ(10)తో కలిసి నాలుగు రోజుల కిందట గోవాకు వెళ్లి..శనివారం రాత్రి తిరిగి వచ్చారు. అయితే దంపతులు పిల్లలకు రాత్రి భోజనం తీసుకొచ్చేందుకు ద్విచక్రవాహనంపై బయటకు వచ్చారు. కారు డ్రైవర్ నిర్లక్ష్యానికి బలయ్యారు. తల్లిదండ్రుల మృతితో వారి పిల్లలు అనాథలయ్యారు.
రాత్రి ఎనిమిదయ్యిందంటే..
సిటీబ్యూరో: రోడ్లపై రయ్యిమంటూ వేగంగా వెళ్లే వాహనాలు… ఒకరు తాగి వేగంగా నడిపితే.. మరొకరు నిర్లక్ష్యంగా డేంజరస్ డ్రైవింగ్ చేస్తున్నారు. ఇలాంటి వాళ్లను కట్టడి చేయాల్సిన ట్రాఫిక్ పోలీసులు రాత్రి 8 అయ్యిందంటే రోడ్లపై కనిపించరు. ఇంకేముంది రోడ్లపై డేంజరస్ డ్రైవింగ్ చేసేవాళ్లతో అమాయకుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. లంగర్‌హౌస్‌లో ద్విచక్రవాహనంపై వెళ్తున్న దంపతులను మద్యం మత్తులో వేగంగా వచ్చిన కారు ఢీకొట్టడంతో వారు మృతి చెందారు. ఆ రూట్లో శనివారం రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ జరిగి ఉంటే ప్రమాదం సంభవించేది కాదు. కనీసం ట్రాఫిక్ పోలీసులు రోడ్డుపై కనిపించినా.. ఉల్లంఘనదారుల్లో భయం అనేది ఉండేది.