సిటీబ్యూరో, మే 26 (నమస్తే తెలంగాణ) : జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో అధికారులు అర్జీలను స్వీకరిస్తున్న క్రమంలో మూసాపేట నుంచి ఇద్దరు చిన్నారులు వచ్చారు. తమకు పార్కు కావాలంటూ..అధికారులను కలిసి వినతిపత్రం సమర్పించారు. మూసాపేటలో పిల్లలు ఆడుకోవడానికి ఒక్క పార్కు కూడా లేదని, అంజయ్య నగర్లో ఉన్న పార్కు స్థలాన్ని కొందరు కబ్జా చేశారని చిన్నారులు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు.
ఈ పార్కును అభివృద్ధి చేసేందుకు గతంలో రూ.50 లక్షలు మంజూరు చేశారని, నిధులు విడుదల చేయకపోవడంతో పనులు ఆగిపోయాయని, వెంటనే పనులు ప్రారంభించాలని విన్నవించారు. ‘మేమంతా ఫ్రెండ్స్‌తో కలిసి పార్కులో ఆడుకుంటామం’టూ ఆ చిన్నారుల అధికారుల ఇచ్చిన వినతిపత్రంలో వివరించారు.