సిటీబ్యూరో, జూన్ 26(నమస్తే తెలంగాణ): హైడ్రా పేరుతో బెదిరింపులకు పాల్పడిన ఇద్దరిపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. కరీంనగర్ జిల్లాకు చెందిన మిరియాల వేదాంతం(22) వృత్తిరీత్యా కారు డ్రైవర్. ఉపాధి కోసం నగరానికి వచ్చి అల్కాపూరి టౌన్షిప్లో నివాసముంటున్నాడు. మణికొండలోని పుప్పాలగూడ, ఎస్టీమ్ రెసిడెన్సీలో నివాసముండే యెలిసెట్టి శోభన్‌బాబు ఆర్టీసీలో పనిచేసి రిటైర్డ్ అయ్యాడు. కాగా, వీరిద్దరు సులభంగా డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకున్నారు.
ఈ మేరకు హైడ్రా దాడులను ఆసరాగా చేసుకుని ఈనెల 23న గండిపేట మండలం, నెక్నాంపూర్ గ్రామం, అలాపూర్ టౌన్‌షిప్‌లోని ఓ ఇంటి వద్దకు నలుపు రంగు కారులో వచ్చారు. అనంతరం ఇంటి ఆవరణలోకి ప్రవేశించి తనిఖీ చేశారు. దీంతో ఆ ఇంట్లో పనిచేసే గుంతకల్ మల్లికార్జున్ ‘మీకు ఎవరు కావాలని ప్రశ్నించగా’ తాము హైడ్రా అధికారులమంటూ చెప్పడమే కాకుండా ఈ నివాసంపై ఫిర్యాదులు వచ్చాయని, కూల్చేస్తామని బదులిచ్చారు.
దీంతో ఈ విషయాన్ని వెంటనే ఇంటి యజమానికి చేరవేసిన మల్లికార్జున్, తమ యజమానితో మాట్లాడాలి అని వేదాంతం, శోభన్‌బాబులకు చెప్పాడు. కానీ నిందితులు యజమానితో మాట్లాడకుండా అక్కడి నుంచి జారుకున్నారు. ఇంటి యజమాని సూచన మేరకు మల్లికార్జున్ హైడ్రా పేరుతో బెదిరింపులకు పాల్పడిన నిందితులపై గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితులిద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
హైడ్రా పేరు చెప్పి ఎవరైనా మోసాలకు, బెదిరింపులకు పాల్పడితే వెంటనే వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని హైడ్రా అధికారులు గురువారం ఓ ప్రకటనలో కోరారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించవద్దని.. నేరుగా తమకు ఆ సమాచారం ఇచ్చినా వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపింది. హైడ్రా ఉద్యోగులు విచారణ చేపడితే.. పూర్తి వివరాలు అందజేస్తారని, ఒకవేళ హైడ్రా ఉద్యోగులు కూడా మోసాలకు పాల్పడి.. హైడ్రా పేరును దుర్వినియోగం చేస్తే వారిపైన కూడా కఠిన చర్యలు తీసుకుంటామని హైడ్రా అధికారులు స్పష్టం చేశారు. ఎవరైనా మోసాలకు పాల్పడితే.. సెల్ : 8712406899 నంబరుకు కాల్ చేసి గానీ, సమాచారాన్ని వాట్సాప్‌లో అందజేయడంతోపాటు వారి ఫొటోలు కూడా పంపించాలని అధికారులు కోరారు.