ఇంత అన్నారు… అంత అన్నారు… అంతలోనే ముంత బోర్లెసినట్లుగా ఉంది ఎలివేటెడ్ కారిడార్ల కథ. ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టుకు తామే జీవం పోశామంటూ.. రక్షణ శాఖ భూముల ప్రక్రియ కూడా తమతోనే సాధ్యమైందంటూ గొప్పలు పోయారే తప్ప.. తట్టెడు మట్టిని ఇప్పటికీ తరలించలేదు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం శంకుస్థాపనలతో చేసిన పనులు.. ‘ఎలక్షన్ స్టంట్’ అని తేలిపోయింది. దీంతో హైదరాబాద్‌కు తలమానికం కానున్న రెండు ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి ఆరు నెలలకు పైగా గడుస్తున్నా.. ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఇప్పటికీ ఎప్పుడో మొదలుకావాల్సిన ప్రాజెక్టు…ప్రాథమిక దశను కూడా దాటలేకపోయింది. ఇక ట్రాన్సాక్షనల్ అడ్వైజర్ల పేరిట కాలం వెళ్లదీయాల్సిన పరిస్థితి నెలకొన్నది. అట్టహాసంగా భూమిపూజ చేసుకున్నా.. కాగితాలపైకి తీసుకురావడంలో సర్కారు విఫలమైంది.
Elevated Corridor | సిటీబ్యూరో, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ నగరానికి ప్రతిష్టాత్మకమైన రెండు ఎలివేటెడ్ కారిడార్ల ప్రాజెక్టులు కాగితాల మీదకు కూడా తీసుకురాలేదు. ఓ వైపు రక్షణ శాఖ నుంచి తీసుకున్న భూములకు పరిహారం ఇతర ప్రాంతాల్లో భూముల బదలాయింపు ప్రక్రియ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా మారితే… ఇక ప్రాజెక్టు నిర్మాణంపై పూర్తి స్థాయి అంచనాకు ప్రభుత్వం రాలేకపోయింది.
హెచ్ఎండీఏ నిధులతో చేపడుతున్న ఈ ప్రాజెక్టుకు.. తెలంగాణలో ఇప్పటివరకు ఎక్కడా లేనట్లుగా ట్రాన్సాక్షనల్ అడ్వైజర్లతో(టీఏ) అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. టీఏలను నియమించుకునేందుకు నెల రోజుల కిందట కార్యాచరణ రూపొందించగా, కనీసం టెండర్ల ప్రక్రియ కూడా పూర్తి కాలేదు. ఏజెన్సీల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో గడువును ఆగస్టు 12 వరకు పొడిగించారు.
డిజైన్లు ఖరారైనా..
దాదాపు 16 కిలోమీటర్ల మేర రెండు ప్రధాన మార్గాల్లో నిర్మించనున్న ఎలివేటెడ్ కారిడార్ల డిజైన్లు ఇప్పటికే ఖరారయ్యాయి. కానీ కార్యరూపంలోకి ప్రాజెక్టులను తీసుకురావడంలో టీఏలు ఇచ్చే సలహాలు ప్రామాణికం. ప్రాజెక్టు వ్యయంపై పూర్తి స్పష్టత లేకనే ప్రత్యామ్నాయంగా టీఏలను నియమించుకుంటున్నట్లు తెలుస్తున్నది. ప్యాట్నీ నుంచి తూంకుంట వరకు వెస్ట్ మారేడ్‌పల్లి, కార్ఖానా, తిరుమలగిరి, బొల్లారం, అల్వాల్, హకీంపేట మీదుగా తూంకుంట వరకు ఉండే 11 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్‌ను సమగ్రంగా పరిశీలించేందుకు ఈ టీఏలను ఆశ్రయించగా, ఆ ప్రతిపాదనలు ఇంకా కొలిక్కి రాలేదు.
పనులు మొదలయ్యేదెన్నడూ?
ప్రాజెక్టు ఖర్చు, నిర్మాణ వ్యయం, రెవెన్యూ వంటి విషయాల్లో అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం ట్రాన్సాక్షనల్ అడ్వైజర్లను నియమించాలని హెచ్ఎండీఏను ఆదేశించింది. జేబీఎస్ నుంచి శామీర్‌పేట వరకు, ప్యారడైజ్ నుంచి డెయిర్ ఫాం రోడ్డు వరకు నిర్మించనున్న రెండు ఎలివేటెడ్ కారిడార్ల కోసం సలహాదారులను నియమించుకునేందుకు హెచ్ఎండీఏ టెండర్లను పిలిచినా ఏ ఒక్క ఏజెన్సీ కూడా ముందుకు రాలేదు.
కాగితాలెక్కని కారిడార్లు..
దాదాపు రూ. 3,800 కోట్ల అంచనా వ్యయంతో ఉత్తర తెలంగాణకు రవాణా సదుపాయాన్ని మెరుగుపరిచే ఈ ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ సర్కారు జాప్యం చేస్తున్నది. ఇప్పటికీ భూసేకరణ పనులు మొదలుపెట్టకపోగా, భూములు కోల్పోతున్న వారికి పరిహారం చెల్లించాలని ప్రాథమికంగా అనుకున్నప్పటికీ… రక్షణ శాఖ కోల్పోతున్న భూములకు మాత్రం ఇతర ప్రాంతాల్లో స్థలాలను కేటాయించాల్సి ఉంటుంది. కనీసం భూ బదలాయింపు ప్రక్రియలోనూ ఎలాంటి పురోగతి లేదు.
భూ బదలాయింపులో జాప్యం..
బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఈ ప్రాజెక్టు నమూనాలు సిద్ధమైనప్పటికీ.. రక్షణ శాఖ భూముల బదలాయింపులో జాప్యం కారణంగా ప్రాజెక్టు ముందు సాగలేదు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఈ ప్రాజెక్టుకు భూములను కేటాయించేందుకు రక్షణ శాఖ ముందుకు రావడంతో.. ప్రాజెక్టు పట్టాలెక్కుతుందని భావించారు. కానీ ప్రభుత్వం ఆర్థిక వనరులు, వినియోగం, నిర్వహణ భారం వంటి రెవెన్యూ పరమైన అంశాలపై సమగ్రమైన నివేదికను రూపొందించలేకపోయింది. దీంతో థర్డ్ పార్టీ ఏజెన్సీలను నియమించుకునేలా హెచ్ఎండీఏకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీనికి ఆర్థిక వ్యవహారాల, మంత్రిత్వ శాఖతోపాటు ఎన్హెచ్ఏఐ గుర్తింపు పొందిన ట్రాన్సాక్షనల్ అడ్వైజరీ కన్సల్టెన్సీలను హెచ్ఎండీఏ ఆశ్రయించింది. కానీ ఇప్పటి వరకు ఏ ఒక్క ఏజెన్సీ కూడా ముందుకు రాలేదు.