Crime News | వెంగళరావునగర్, అక్టోబర్ 3 : మద్యం తాగే క్రమంలో జరిగిన చిన్న గొడవతో హత్య చేసి.. మెట్లెక్కబోతు జారిపడగా.. కడుపులో కత్తి గుచ్చుకుని చనిపోయాడని కట్టుకథ అల్లారు.. నిందితులు చెప్తు న్న మాటల్లో అనుమానం వచ్చి సీసీ ఫుటేజీలు పరిశీలించగా హత్య దృశ్యాలు బయటపడ్డాయి. ప్రధా న నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకోగా.. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. ఎస్ఆర్నగర్ పోలీసుల కథనం ప్రకారం.. బల్కంపేట్‌కు చెందిన సర్దార్ గురుప్రీత్‌సింగ్ (26) సాఫ్ట్వేర్ ఉద్యోగి. ఇటీవలే తన ఉద్యోగాన్ని మానేశాడు. మంగళవారం సాయంత్రం కృష్ణానగర్‌లోని ఓ మద్యం దుకాణం వద్ద పెదనాన్న కుమారుడు ఆటోట్రాలీ డ్రైవర్‌గా పనిచేసే సర్దార్ బల్వీర్ సింగ్‌ను కలిశాడు. అక్కడ అప్పటికే బల్వీర్ సింగ్ స్నేహితులు ఇద్దరు, ఏఆర్ కానిస్టేబుల్ సాయి ఉన్నారు.
ఈ ఐదుగురు కలిసి మద్యం తాగారు. కానిస్టేబుల్ సాయి సిగరెట్ కాల్చుతుంటే..గురుప్రీత్‌సింగ్ తనకు వాసన పడదని అభ్యంతరం చెప్ప గా.. ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అక్కడ నుంచి అమీర్‌పేట్ చెన్నై షాపింగ్ మాల్ వెనక వైపు కుమ్మరబస్తీకు వెళ్లే మార్గం వద్ద ఓ వైన్‌షాపు వద్ద కూర్చుని మద్యం తాగారు. మళ్లీ కానిస్టేబుల్ సాయి సిగరెట్ కాల్చుతుండగా..గురుప్రీత్‌సింగ్ అభ్యంతరం చెప్పి అతని బైక్ కీస్‌ను లాక్కున్నాడు. బైక్ కీస్ ఇవ్వకపోవడం తో ఆవేశానికిలోనైన బల్బీర్‌సింగ్ ఒక్కసారిగా గురుప్రీత్సింగ్ను కత్తితో కడుపులో పొడిచాడు. అనంతరం అమీర్‌పేట్‌లోని ఓ ప్రైవేటు దవాఖానలో చేర్పించగా..చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందాడు.
మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసిన ఎస్ఆర్నగర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తమ ఇంటి మెట్లపై నుంచి జారిపడ్డాడని..పడిన సమయంలో నడుముకు ఉన్న కంజర్(కత్తి) కడుపులో గుచ్చుకోవడంతో గాయపడి.. చికిత్స పొందుతూ మృతి చెందాడంటూ మృతుడి తండ్రికి ఫోన్‌చేసి చెప్పారు. కొంతమంది బస్తీ నాయకులతో పోలీసుస్టేషన్‌కు వచ్చి కూడా నిందితుడు కట్టుకథ వినిపించారు. అనుమానం వచ్చిన పోలీసులు సీసీ ఫుటేజ్‌లను పరిశీలించారు. అందులో అమీర్‌పేట్ కుమ్మరబస్తీలోని ఓ భవనంలోని సీసీ కెమెరాలో కత్తితో పొడిచి హత్య చేస్తున్న దృశ్యాలు బయటపడ్డాయి. వెంటనే ప్రధాన నిందితుడు బల్వీర్ సింగ్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా .. తానే హత్య చేసినట్టు ఒప్పుకున్నాడు. స్నేహితుడు ఏఆర్ కానిస్టేబుల్ సాయితో గొడవపడ్డాడని..ఆవేశంలో తాను ఈ హత్య చేసినట్టు నేరాన్ని అంగీకరించాడు. పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం పోలీసులు గాలిస్తున్నారు.