చిక్కడపల్లి, జూలై 31: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కులను కాలరాస్తున్నాయని టీయూసీఐ రాష్ట్ర కార్యదర్శి ఎస్ఎల్ పద్మ అన్నారు. టీయూసీఐ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కమిటీల ఆధ్వర్యంలో కనీస వేతనం 26వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గురువారం ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని కార్మిక శాఖ భవనం ముందు ధర్నా నిర్వహిచారు.
ఈ సందర్భంగా పద్మ మాట్లాడుతూ.. కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన నూతన లేబర్ కోడ్లను రద్దుచేయాలని అన్నారు. కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని, కనీస పెన్షన్ రూ.9వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికుల హక్కులను కాలరాస్తామంటే సహించేది లేదని అన్నారు. కార్మికులు సంఘటితంగా పోరాటాలు చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.
అనంతరం కార్మికశాఖ అడిషనల్ కమిషనర్ గంగాధర్‌కు వినతిపత్రం అందజేశారు. ఆయా జిల్లాల కార్యదర్శి వీ ప్రవీణ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు కేఎస్ ప్రదీప్, జీ లింగాగౌడ్, ఎండీ అఫ్జల్,బీ ప్రభాకర్, శ్రీనివాస్, లక్ష్మీ, టీ నారాయణ, వెంకటేష్, జీ వెంకటేష్ తదితరలు పాల్గొన్నారు.