సిటీబ్యూరో, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ): దక్షిణ డిస్కంలో అసిస్టెంట్ ఇంజనీర్లు జీరో ఫిర్యాదులే లక్ష్యంగా పనిచేయాలని టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫరూఖి ఆదేశించారు. వారానికి రెండుసార్లు తమ పరిధిలోని బస్తీలు, కాలనీల్లో విద్యుత్ నెట్వర్క్ను క్షుణ్ణంగా తనిఖీలు చేయడం, వినియోగదారులను కలవడం వంటివి చేయాలని ముషారఫ్ ఫరూఖి అధికారులను ఆదేశించారు.
శుక్రవారం మింట్కాంపౌండ్లోని డిస్కం ప్రధాన కార్యాలయంలో రంగారెడ్డి, మేడ్చల్ జోన్లలో వివిధ విభాగాలకు చెందిన 180 మంది అసిస్టెంట్ ఇంజనీర్లతో సీఎండీ సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. సెక్షన్ల వారీగా ఎక్కువ ఫిర్యాదులు నమోదవుతున్న అసిస్టెంట్ ఇంజనీర్లతో సీఎండీ నేరుగా మాట్లాడారు. ఫిర్యాదులను పరిశీలించి అందుకు గల కారణాలను విశ్లేషించి మరోసారి అటువంటి ఫిర్యాదులు రాకుండా చర్యలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు.
విద్యుత్ ఉద్యోగులు వినియోగదారులను కలుస్తూ స్నేహభావంతో మెలగాలని, వారికి ఎలాంటి సమస్య ఎదురైనా అది ఏ సమయమైనా ఏఈల దృష్టికి తీసుకొచ్చే వాతావరణం క్షేత్రస్థాయిలో కల్పించాలని సీఎండీ తెలిపారు. ఇరుకైన గల్లీలు, మురికివాడల్లో ప్రమాదకరంగా ఉన్న ఓవర్హెడ్ లైన్ల స్థానంలో ఎయిర్ బంచెడ్ కేబుల్ ఏర్పాటు చేసేందుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, దీనికి సంబంధించి పాలనాపరమైన అనుమతులను సంస్థ సులభతరం చేసిందని తెలిపారు. ఈ సమావేశంలో డైరెక్టర్లు డా.నర్సింహులు, శివాజీ, చక్రపాణి, వేణుగోపాల్, సురేశ్ తదితరులు పాల్గొన్నారు.