Musharraf Farooqui | సిటీబ్యూరో: సంక్రాంతి పండుగ రోజుల్లో పతంగులు ఎగురవేయడం ఆనవాయితీగా వస్తున్నదని, అయితే పతంగులు ఎగురవేసేవారు విద్యుత్ లైన్లు, ట్రాన్స్ఫార్మర్ల విషయంలో జాగ్రత్తలు పాటించాలని టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫరూఖి సూచించారు. విద్యుత్ లైన్లు, ట్రాన్స్ఫార్మర్లకు దూరంగా బహిరంగ ప్రదేశాల్లో, మైదానాల్లో మాత్రమే పతంగులు ఎగురవేయాలని, ఒకవేళ పతంగులు కానీ, మాంజలు కానీ విద్యుత్ లైన్లపై, విద్యుత్ పరికరాలపై పడితే కరెంటు సరఫరాలో అంతరాయంతో పాటు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు.
కాటన్, నైలాన్, లినెన్తో చేసిన మాంజాలను మాత్రమే వాడాలని, మెటాలిక్ మాంజాలు వాడొద్దని, మెటాలిక్ మాంజాలు విద్యుత్ వాహకాలు కనుక.. అవి వైర్లపై పడితే విద్యుత్ షాక్ తగిలే ప్రమాదం ఉందని సీఎండీ పేర్కొన్నారు. పొడి వాతావరణంలో మాత్రమే పతంగులు ఎగురవేయాలని, తడి వాతావరణంలో విద్యుత్ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందన్నారు. పతంగులు, మాంజాలు విద్యుత్ వైర్లపై పడినప్పుడు వాటిని వదిలేయాలని, ఒకవేళ వాటిని పట్టుకుని లాగితే విద్యుత్ తీగలు ఒకదానికొకటి రాసుకొని విద్యుత్ ప్రమాదం జరిగే అవకాశం ఉందని చెప్పారు. ఎలాంటి అత్యవసర పరిస్థితులు లేదా ప్రమాదకర పరిస్థితులు ఏర్పడినా 1912కు కాల్ చేసి తమకు సమాచారం ఇవ్వాలని, లేదా సమీప విద్యుత్ కార్యాలయానికి తెలియజేయాలని, మొబైల్ యాప్ లేదా www.tgsouther npower.org వెబ్సైట్లో కానీ సమాచారం ఇవ్వాలని దక్షిణ తెలంగాణ విద్యుత్ వినియోగదారులకు, ప్రజలకు సూచించారు.