కవాడిగూడ, నవంబర్ 25: సీనియర్ ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నుంచి మినహాయింపు ఇవ్వాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి ప్రభుత్వాన్ని కోరారు. విద్యాహక్కు చట్టం, ఎన్సీటీఈ నోటిఫికేషన్‌కి పూర్వం నియామకమైన ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ స్కూట్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్టీఎఫ్ఐ) పిలుపు మేరకు మంగళవారం టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యాలయం నుంచి ప్రధాని కార్యాలయానికి గ్రీవెన్స్ పోర్టల్ ద్వారా మెమోరాండం సమర్పించినట్లు ఆయన తెలిపారు.
దేశవ్యాప్తంగా 25 లక్షల మంది, రాష్ట్రంలో 45వేల మంది ఉపాధ్యాయులను ఆందోళనకు గురిచేస్తున్న టెట్ పరీక్షను 2010కి ముందు నియామకమైన ఉపాధ్యాయులకు మినహాయింపునిస్తూ విద్యా హక్కు చట్టాన్ని సవరించాలని డిమాండ్ చేశారు. టీఎస్‌యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి వెంకట్, కార్యదర్శి సింహాచలం, సంపాదకులు మాణిక్‌రెడ్డి, నాయకులు..జయసింహారెడ్డి, మదన్‌రెడ్డి, నీరజ, శ్రీనివాస్, రవికుమార్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.