సిటీబ్యూరో, జూన్ 7 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు ఇప్పట్లో తోపులాటలు, కిక్కిరిపోయిన జనాల నడుమ ప్రయాణాలు తప్పేలేవు. పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా కొత్త బోగీలను ఏర్పాటు చేస్తామని ప్రకటించిన మెట్రో నిర్వహణ సంస్థ ఎల్ అండ్ టీ ఆ దిశగా ఒక్క అడుగు ముందుకు వేయలేదు. కనీసం ప్రతిపాదనలను ప్రభుత్వానికి అందజేయకుండా జాప్యం చేస్తుండటంతో.. నగరవాసులకు మెట్రో ప్రయాణం ఇబ్బందిగా మారుతోంది.
పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా అదనపు బోగీలను తీసుకోవాల్సి ఉన్నా.. అందుకు తగిన ప్రతిపాదనలు ఇంకా కార్యరూపంలోకి రాలేదు. దీంతో కొత్త బోగీల వ్యవహారంలో మెట్రో నిర్వహణ సంస్థ నాన్చుడు ధోరణితో వ్యవహారిస్తోంది. హైదరాబాద్ మెట్రోలో ప్రయాణించే వారి సంఖ్య నిత్యం పెరుగుతున్నా.. అందుకు సరిపడా బోగీలు లేవు. దీంతో మెట్రో రైళ్లన్నీ ప్రయాణికులతో పీక్ అవర్స్‌లో నిండిపోతున్నాయి. కిక్కిరిసిన జనంతో.. గమ్యస్థానాలకు చేర్చుతుందే తప్పా..
కొత్తగా బోగీలను ఏర్పాటు చేసి, ప్రయాణికులకు సౌకర్యవంతమైన రవాణా సదుపాయాలను కల్పించడంలో హైదరాబాద్ మెట్రో నిర్లక్ష్యం చేస్తోంది. నష్టాల పేరిట అదనపు బోగీల విషయాన్ని పక్కన పెడుతుండటంతో రద్దీ సమయంలో గంటల కొద్దీ స్టేషన్ల వద్ద ఎదురుచూడాల్సిన వస్తోంది. ఇలాంటి ఇబ్బందుల నేపథ్యంలో కొంతమంది ప్రత్యామ్నాయ మార్గాల్లో జర్నీ చేసే వారి సంఖ్య ఎక్కువే ఉంటుంది. సాధారణ సమయంలో ఖాళీగానే ఉన్నా..
ఉద యం 6-10గంటల మధ్య, సాయం త్రం 5-8గంటల మధ్య రద్దీ ఒక్కసారిగా పెరుగుతున్నది. ప్రస్తుతం ఉన్న మూడు బోగీలతో వెయ్యి మంది మాత్రమే ప్రయాణించే వీలు ఉంది. కానీ అంతకు మించి ప్లాట్ఫారం మీద ప్రయాణికులు చేరడంతో.. తర్వాతి ట్రైన్ కోసం ఎదురుచూస్తున్నామని ప్రయాణికులు వాపోతున్నారు. నిత్యం ఇలాంటి ఇబ్బందులతో గమ్యస్థానాలకు చేరుకోవడంలో జాప్యం జరుగుతున్నదని పలువురు మెట్రో ప్రయాణికులు వాపోతున్నారు.
అదనపు బోగీలకు మరో ఏడాది
నిజానికి గతేడాది జూలై నాటికే కొత్త బోగీలను ఏర్పాటు చేసుకోవాలని మెట్రో భావించింది. కానీ ఎల్ అండ్ టీ ఆసక్తి చూపలేదు. ఇప్పటికే నిర్వహణ భారం పేరిట అరకొర వసతులతోనే సేవలను అందిస్తుండగా… కొత్త బోగీలు అసాధ్యమేనన్నట్లుగా వ్యవహరించింది. ఇక హెచ్ఎంఆర్ఎల్ కూడా అంతగా దృష్టి సారించలేదు. దీంతో మెట్రో ప్రారంభమై దాదాపు ఆరేళ్లు గడిచినా కొత్త బోగీల ఊసే లేకుండాపోయింది.
అయితే ఇటీవల కాలంలో క్రమంగా పెరుగుతున్న మెట్రో ప్రయాణికులతో సాధారణ సమయంలోనూ స్టేషన్ల వద్ద భారీగా రద్దీ ఏర్పడుతున్నది. దీంతో అదనపు బోగీలు లేకపోవడంతో కిక్కిరిసిన జనాల మధ్య ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. ఈ క్రమంలో అదనపు బోగీలను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలకు డిమాండ్ పెరిగింది. పరిమితికి మించి కొన్ని సందర్భాల్లో ప్రయాణించాల్సి వస్తున్నదని, హెచ్ఎంఆర్ఎల్ ఎట్టకేలకు కొత్త బోగీలను ఏర్పాటు చేస్తామని ప్రకటించినా… ఇప్పటివరకు ఆ దిశగా అడుగులు పడలేదు.
ఒక వేళ ఆర్డర్ చేసినా..
తొలి దఫా నాలుగు బోగీలు, మరో దఫా 6 బోగీలను తీసుకు వచ్చేలా పుణే కోచ్ ఫ్యాక్టరీని కోరాల్సి ఉంది. ఒకవేళ ఆర్డర్ చేసినా… మెట్రో చేతికి అందడానికి కనీసం 9-12 నెలల సమయం పట్టనున్నది. ఈ క్రమంలో ఇప్పటికిప్పుడు మెట్రో సంస్థ బోగీల కోసం ఆర్డర్ చేసినా… ఏడాది తర్వాతే వాటిలో ప్రయాణించే వీలు ఉంది. అప్పటివరకు మెట్రో ప్రయాణికులు కొత్త బోగీల ఊసే లేకుండా… అవసరాన్ని బట్టి ప్రయాణ ఏర్పాట్లు చేసుకుని, మెట్రో రద్దీ బాధల నుంచి బయటపడాల్సిందే.