అడ్డగుట్ట, నవంబర్ 25 : అడ్డగుట్టను అభివృద్ధి పథంలో నడిపిన ఘనత తమదేనని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ అన్నారు. శుక్రవారం అడ్డగుట్ట డివిజన్ పరిధిలో రూ.1.20కోట్ల వ్యయంతో నిర్మించతలపెట్టిన అభివృద్ధి పనులకు స్థానిక కార్పొరేటర్ లింగాని ప్రసన్న లక్ష్మితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా తుకారాంగేట్ రియో పాయింట్ హోటల్ వద్ద రూ.30 లక్షలతో వర్షపునీటి కాలువ నిర్మాణ పనులు, ఇందిరాగాంధీ విగ్రహం వద్ద రూ.30 లక్షలతో సీసీ రోడ్డు పనులు, లాలాగూడ కట్టెలమండి వద్ద రూ.58 లక్షలతో సీసీ రోడ్డు పనులకు ఆయన ప్రారంభోత్సవం చేశారు.
అనంతరం పద్మారావు గౌడ్ మాట్లాడుతూ… సికింద్రాబాద్ నియోజకవర్గ పరిధిలోని ప్రతి కాలనీ, బస్తీకి నిధులకు వెనకడుగు వేయకుండా అందంగా తీర్చిదిద్దుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ దశరథ్, టీఆర్ఎస్ యువ నాయకులు రామేశ్వర్ గౌడ్, నగర గ్రంథాలయ డైరెక్టర్ లింగాని శ్రీనివాస్, జీహెచ్ఎంసీ ఈఈ ఆశలత, ఏఈ వేణు, పార్టీశ్రేణులు పీ.శ్రీనివాస్ గౌడ్, అమర్ బాన్సోడే, గీతతో పాటు తదితరులు పాల్గొన్నారు.