ప్లీనరీకి తరలి వెళ్లిన మహానగర ప్రజాప్రతినిధులు
ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు
గులాబీ వనమైన హైదరాబాద్
సిటీబ్యూరో, ఏప్రిల్ 27(నమస్తే తెలంగాణ): తెలంగాణ ఏర్పాటే లక్ష్యంగా ఆవిర్భవించిన టీఆర్ఎస్ 21వ వార్షికోత్సవం అట్టహాసంగా సాగింది. ఐటీ కారిడార్‌లోని హెచ్ఐసీసీ వేదికగా నిర్వహించిన ప్లీనరీకి గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. మరోవైపు ప్లీనరీని పురస్కరించుకొని నగరాన్ని గులాబీమయంగా మార్చారు. జూబ్లీహిల్స్ నుంచి మొదలుకొని సైబర్ టవర్స్ వరకు సుందరంగా తీర్చిదిద్దారు. సభా ప్రాంగణంలో ఎలాంటి ట్రాఫిక్ చిక్కులు ఎదురు కాకుండా పోలీసులు ప్రత్యేక ప్రణాళికను రూపొందించి అమలు చేశారు. ముందుగా నిర్దేశించిన పార్కింగ్ స్థలాల్లోనే వాహనాలను నిలిపేలా చూశారు. హెచ్ఐసీసీతో పాటు హైటెక్స్ ప్రాంగణాన్ని ప్లీనరీ కోసం తీసుకొని ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూశారు.
ప్లీనరీలో మాట్లాడుతున్న కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్
ముఖ్యమంత్రి కేసీఆర్‌కి స్వాగతం పలికేందుకు వచ్చిన గిరిజన మహిళలతో కలిసి జూబ్లీహిల్స్‌లో నృత్యం చేస్తున్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్
ప్లీనరీలో పాల్గొన్న ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తా, ఎమ్మెల్యేలు జోగు రామన్న, జైపాల్ యాదవ్ తదితరులు
ఏర్పాట్లు భేష్..
ప్లీనరీలో ఏర్పాట్లు బాగున్నాయి. ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చక్కటి ఏర్పాట్లు చేశారు. సభా ప్రాంగణంలోకి వెళ్లేందుకు బార్కోడ్ ఏర్పాటు చేయడం బాగుంది. పసందైన రుచులు ఆస్వాదించాం. ప్లీనరీలో తెలంగాణ ప్రజల సంక్షేమానికి తోడు దేశ ప్రగతిపై సీఎం కేసీఆర్ చేసిన ప్రసంగం ఎందరిలో స్ఫూర్తి నింపింది. –ఏకే స్వరూప, తెలంగాణ రాష్ట్ర గంగపుత్ర మహిళ
ఆలోచింపజేసేలా తీర్మానాలు..
రాష్ట్ర అభివృద్ధే కాకుండా దేశ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్లీనరీలో ప్రవేశపెట్టిన తీర్మానాలు ప్రతిఒక్కరిని ఆలోచింపజేశాయి. ప్రవేశపెట్టిన మొత్తం 11 తీర్మానాలు ఎంతో బాగున్నాయి. దేశం మారాలంటే సీఎం కేసీఆర్ ఉండాల్సిందే. ప్రతిఒక్కరి సహకారంతో సభ విజయవంతమైంది.
–వి.పూజిత జగదీశ్వర్‌గౌడ్, హఫీజ్‌పేట్ కార్పొరేటర్