సిటీబ్యూరో, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ) : హెచ్ఎండీఏ నెత్తిన ట్రిపులార్ కుంపటిని పెట్టిన కాంగ్రెస్ సర్కారు.. రైతులను తప్పుదోవ పట్టించేలా వ్యవహరిస్తోంది. సంబంధం లేని వ్యవహారంలోకి హెచ్ఎండీఏను లాగి రైతులకు సమాచారం లేకుండా చేస్తోంది. ప్రాజెక్టు భూసేకరణ హెచ్ఎండీఏ చేస్తుందనే భావనతో రైతులతోపాటు, ట్రిపులార్ భూ బాధితులు ఇప్పుడు హెచ్ఎండీఏకు క్యూ కడుతున్నారు. ఈ ప్రాజెక్టుతో హెచ్ఎండీఏకు ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ సంబంధమే లేకున్నా… హెచ్ఎండీఏ వెబ్సైట్లో భూసేకరణ నోటిఫికేషన్ ప్రచురితం కావడంతో రైతులు గందరగోళానికి గురవుతున్నారు. హెచ్ఎండీఏ కార్యాలయానికి వచ్చే రైతులకు, ఆ ప్రాజెక్టులో ఎలాంటి ప్రమేయం లేదని చెబుతున్నా… పెరుగుతున్న భూ బాధితులను చూసి అధికారులే తలలు పట్టుకుంటున్నారు.
కాంగ్రెస్ సర్కారు ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా చేపడతున్నామని గొప్పలు పోతుందే తప్పా.. భూముల కోల్పోయి జీవనాధారం కోల్పో యే రైతుల విషయంలో ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. ఆగస్టు నెలాఖరున రీజినల్ రింగు రోడ్డు ప్రాథమిక నోటిఫికేషన్ హెచ్ఎండీఏ ప్రచురించింది. ఎనిమిది జిల్లాల మీదుగా వంద మీటర్ల వెడల్పుతో నిర్మించనున్న ఈ రోడ్డు ఆలైన్‌మెంట్‌కు సంబంధించిన వివరాలను హెచ్ఎండీఏ అధికారిక వెబ్సైట్ జనాలకు అందుబాటులో ఉంది. ఇదే హెచ్ఎండీఏ చేసిన తప్పుగా మారింది. దీంతో ట్రిపులార్ ప్రాజెక్టు ద్వారా భూములు కోల్పోతున్న రైతులు.. హెచ్ఎండీఏ భూసేకరణ చేస్తుందని భావించి.. అమీర్‌పేటలోని కార్యాలయానికి పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. నిజానికి ఈ ప్రాజెక్టును ఆర్ అండ్ బీ డిజైన్ చేసింది. భూ సర్వేలోనూ హెచ్ఎండీఏ పాత్ర లేదు. కానీ అలైన్మెంట్ నోటిఫికేషన్‌ను హెచ్ఎండీఏ ప్రచురించడంతో గందరగోళ పరిస్థితులను కాంగ్రెస్ సర్కారు సృష్టించింది.
ఇప్పటికే అవుటర్ నుంచి ఫోర్త్ సిటీ వరకు ప్రతిపాదిత గ్రీన్ ఫీల్డ్ హైవే ప్రాజెక్టుతోనే హెచ్ఎండీఏకు తలకు మించిన భారంగా మారింది. ఈ ప్రాజెక్టు విషయంలోనే భూ సేకరణ ఇబ్బందులను పరిష్కరించడంలో హెచ్ఎండీఏ యంత్రాంగం విఫలమైంది. కనీసం డిజైన్ చేసిన ప్రాజెక్టును కూడా పట్టాలెక్కించ లేని పరిస్థితిలో హెచ్ఎండీఏ ఉంది. అలాంటి యాదాద్రి, నల్గొండ, వికారాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి వంటి ప్రాంతాలను కలుపుతూ నిర్మించి అతిపెద్ద ప్రాజెక్టును హెచ్ఎండీఏకు తగిలించి సర్కారు చోద్యం చూస్తోందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఒక్క నోటిఫికేషన్‌ను ప్రచురించినందుకే ఏడు జిల్లాల నుంచి రైతులు నగరంలోని హెచ్ఎండీఏ కార్యాలయానికి చేరుకుంటున్నారు. దీంతో ప్రమేయం లేని హెచ్ఎండీఏకు ట్రిపులార్ కుంపటిని పెట్టిన కాంగ్రెస్ సర్కారు… రైతులు, అధికారులను తలలు పట్టుకునే స్థితికి వచ్చారు.
ఈ వ్యవహారంలో హెచ్ఎండీఏ వేలు దూర్చిందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఎందుకంటే అసలు ప్రాజెక్టును చేపట్టేది, కట్టేది, నిధులిచ్చేది ఆర్ అండ్ బీ శాఖ అయితే ఈ పురపాలక శాఖ అధీనంలోని హెచ్ఎండీఏను ఎందుకు లాగి, రెండు శాఖల మధ్య సమన్వయం లేకుండా చేసింది. దీంతో అసలు ప్రాజెక్టును ఎవరూ కడుతున్నారనే విషయం తెలియకపోవడంతో రైతులు ఆందోళన చెందుతుంటే… విలువైన భూములను కోల్పోతున్న రైతులు గందరగోళానికి గురైతున్నారు. కనీసం ఈ రెండు శాఖల మధ్య సమన్వయం అయినా ఉంటే రైతులకు ఈ ఇబ్బందులు వచ్చేవి కావనీ, జిల్లాల నుంచి ఇక్కడకు చేరుకునే అవసరమే ఉండదనీ భూ నిర్వాసితులు వాపోతున్నారు.
ఇటీవల హెచ్ఎండీఏ కార్యాలయానికి చేరుకున్న రైతులను చూసి నివ్వెరపోయిన యంత్రాంగం… ఏం చేయాలో పాలుపోలేక… వారి నుంచి వినతిపత్రం తీసుకుంటూనే, ఈ ప్రాజెక్టుతో తమకేలాంటి సంబంధం లేదని వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేసింది. కానీ హెచ్ఎండీఏ నోటిఫికేషన్ ప్రచురించడంతో… రైతులు కూడా భూసేకరణ ప్రక్రియ ఇక్కడి నుంచే జరుగుతుందోననే భావనకు వచ్చి…హుటాహుటినా ఇక్కడి చేరుకుంటున్నారు. రేపు కూడా భూముల పరిరక్షణకు హెచ్ఎండీఏకు రైతులు పెద్ద ఎత్తున రావాలని ట్రిపులార్ భూ నిర్వాసితుల సంఘం పిలుపునిచ్చింది.
ట్రిపులార్ భూసేకరణ వ్యవహారంలో రైతులను డైవర్ట్ చేసేందుకే కాంగ్రెస్ సర్కారు హెచ్ఎండీఏలో నోటిఫికేషన్ ప్రచురించినట్లు అనుమానం వ్యక్తమవుతున్నది. ఇప్పటివరకు జరిగిన ట్రిపులార్ భూసేకరణ వ్యవహారాలన్నీ కూడా ఆర్ అండ్ బీ శాఖనే చూడగా.. వారితోనే రైతులు కూడా సంప్రదింపులు జరిపారు. కానీ తాజా నోటిఫికేషన్ హెచ్ఎండీఏ వెబ్సైట్లో ప్రచురించడంతో రైతులను తప్పుదోవ పట్టించే ఉద్దేశం ఉంటుందనే అనుమానం కలుగుతుంది. కనీసం ఇప్పటికైనా ఈ వ్యవహారంలో హెచ్ఎండీఏ, ఆర్ అండ్ బీ విభాగాల పాత్రలపై స్పష్టత ఇస్తే గానీ రైతులకు ఇబ్బందులు తప్పేలా లేవు.