సిటీబ్యూరో, జూన్ 26 (నమస్తే తెలంగాణ): చెట్ల కటింగ్ దక్షిణ డిస్కంలోని కొందరు అధికారులకు ఆదాయ వనరుగా మారింది. ఎవరి కోసం మరెవరి మెప్పుకోసమో ఆధునిక పరికరాలంటూ చేసిన కొనుగోళ్ల వ్యవహారంలో కోట్ల రూపాయల అవినీతి జరిగిందంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వర్షాకాలం ప్రారంభానికి ముందే చెట్ల కొమ్మలు నరికివేత కార్యక్రమం చేపట్టాల్సి ఉండగా కొంత ఆలస్యంగా ఈ పనులు మొదలుపెట్టినప్పటికీ వాటికి ఉపయోగించే పరికరాల కొనుగోళ్లలో పెద్ద ఎత్తున కమీషన్ల పేరిట డబ్బులు చేతులు మారాయంటూ డిస్కంలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
తాము చెట్ల కొమ్మలు నరికే క్రమంలో బ్యాటరీలు సరిగా పనిచేయక, యంత్రాలు ఆగిపోతుండడంతో సిబ్బంది అసహనానికి గురవుతున్నారు. నగరంతో పాటు రూరల్జోన్లో పలుచోట్ల ట్రీప్రూనింగ్ పనులు ఈ నాసిరకం యంత్రాలతో ఆగిపోతున్నాయని, తిరిగి తాము ప్రారంభించినా.. అవి సరిగా పనిచేయడం లేదంటూ క్షేత్రస్థాయి సిబ్బంది
చెబుతున్నారు.
ఎస్పీడీసీఎల్ పరిధిలో విద్యుత్ లైన్ల నిర్వహణ కోసం అవసరమైన చెట్ల కొమ్మలు కత్తిరించే పరికరాలు కొనుగోలు చేయడానికి తాత్కాలిక అడ్వాన్స్ మంజూరు చేశారు. చెయిన్సా, అదనపు బ్యాటరీతో పోల్ప్రూనర్ , అదనపు బ్యాటరీతో హ్యాండ్హెల్డ్ ట్రీప్రూనర్లను గణేశ్ అగ్రికల్చర్ మిషనరీస్ సంస్థ నుంచి కొనుగోలు చేయడానికి టీజీఎస్పీడీసీఎల్ పరిధిలోని అన్ని సర్కిళ్లకు తాత్కాలిక అడ్వాన్సులు మంజూరు చేసినట్లు ఈనెల 8వ తేదీన సీఎండీ జితేశ్ వీ పాటిల్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ క్రమంలో దక్షిణ డిస్కం పరిధిలో 21 సర్కిళ్లతో పాటు రూరల్ జోన్, స్కాడాకు కలిపి 59 చైన్సా మిషన్లకు రూ.30 లక్షలు, 168 పోల్ ప్రూనర్ విత్ అడిషనల్ బ్యాటరీలకు రూ.1.32 కోట్లు, 752 పోల్ ప్రూనర్ విత్ అడిషనల్ బ్యాటరీలకు రూ.2.61కోట్లు ఖర్చు చేశారు. అన్ని సర్కిళ్లకు వేర్వేరుగా వాటివాటి అవసరాలను బట్టి నిధులు మంజూరు చేయగా వాటిని ఆయా సర్కిళ్ల ఉన్నతాధికారులు గణేశ్ కంపెనీకి చెల్లించి కొనుగోలు చేసినట్లుగా చూపించారు. ఒక చైన్సా ఖరీదు రూ.51,070లుగా చూపిస్తుండగా, పోల్ ప్రూనర్ విత్ అడిషనల్ బ్యాటరీ ఒకటి రూ. 78940లుగా నిర్ణయించారు.
మరో పరికరం హ్యాండ్హెల్డ్ ట్రీప్రూనర్ విత్ అడిషనల్ బ్యాటరీ ఒకటి రూ.18549గా చూపించారు. ఉత్తర్వుల్లో నిర్ణయించిన ఈ ధరల ప్రకారమే ఆయా సర్కిళ్లు తమతమ పరిధిలో ఎన్ని పరికరాలు అవసరమో ఆమేరకు కొనుగోళ్లు చేసి వాటిని క్షేత్రస్థాయిలో సిబ్బందికి అందించారు. వీటి విషయంలో ఎవరికోసం ఈ టెండర్లు కేటాయించారని, అది కూడా ఒక్క సంస్థకే ఈ టెండర్లు కేటాయించడం వెనక మతలబు ఏంటనే చర్చ జరుగుతోంది.
అయితే దక్షిణ డిస్కం కొనుగోళ్లలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎమర్జెన్సీ పనుల కింద కొనుగోలు చేసిన ఈ మూడు పరికరాల విషయంలోనే మార్కెట్ధరకు, డిస్కం నిర్ణయించిన ధరకు చాలా వ్యత్యాసం ఉందని మింట్కాంపౌండ్లో మాట్లాడుకుంటున్నారు. చైన్సా ఖరీదు మార్కెట్లో రూ.20వేలలోపే ఉండగా ఇది రూ.51070లుగా చెప్పారని, హ్యాండ్హెల్డ్ ట్రీ ప్రూనర్ విత్ అడిషనల్ బ్యాటరీ రూ.16వేలు ఉంటుందని, పోల్ ప్రూనర్ అయితే రూ.45వేల లోపే వస్తున్నదని కొందరు విద్యుత్ అధికారులు చెప్పారు.
ఇవి కూడా నాణ్యమైన కంపెనీలకు సంబంధించినవే ఉండగా తమ సొంత లాభం కోసం సదరు ఒకే సంస్థకు ఈ టెండర్ కట్టబెట్టారని, ఇందులో సుమారు రూ.50లక్షల వరకు తేడా ఉంటుందంటూ చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉంటే విద్యుత్ తీగలకు తగిలే చెట్టకొమ్మలను తొలగించేందుకు కొనుగోలు చేసిన ఆధునిక ట్రీ కట్టింగ్ మిషన్లు నాసిరకంగా ఉన్నాయనే ఆరోపణలు తలెత్తుతున్నాయి. అయితే ఎటువంటి టెండర్ లేకుండా నేరుగా రూ.2.6కోట్లకు పైగా నిధులతో 20 సర్కిళ్లలో మూడు రకాల మిషన్లను అందుబాటులోకి తీసుకొచ్చారు.
మార్కెట్ ధర కంటే అధిక ధరకు కొనుగోలు చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. చైన్సా, పోల్ ప్రూనర్ విత్ అడిషనల్ బ్యాటరీ, హ్యాండిల్స్ ట్రీ ప్రూనర్ విత్ అడిషనల్ బ్యాటరీ ధరల్లో చాలా వ్యత్యాసం ఉందని తెలుస్తుంది. ఆన్లైన్, ఆఫ్లైన్ వంటి చోట్ల కూడా వీటి ధర ఉత్తర్వుల్లో పేర్కొన్న దాని కంటే తక్కువగా ఉందని, ఒక్కో పరికరానికి పది నుంచి పదిహేనువేల రూపాయల తేడా వస్తున్నట్లు విద్యుత్ అధికారులే చెప్పుకొంటున్నారు.