చార్మినార్, జూలై 9: శాంతి భద్రతల రక్షణ కోసం పోలీసులు ఎనలేని కృషి చేస్తున్నారని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బుధవారం దక్షిణ మండల పరిధిలోని కాల పత్తర్, ఛత్రినాక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లను నగర కొత్వాల్ సీవీ ఆనంద్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను మరింత పటిష్టం చేయడానికి ప్రభుత్వం భారీగా నిధులను కేటాయింస్తుందన్నారు నగరంలో శాంతి భద్రతల పరంగా పోలీసులు కీలకంగా వ్యవహారించాల్సి ఉంటుందన్నారు. అందుకు తగిన విధంగా ప్రభుత్వం ఎలాంటి అడ్డంకులు లేకుండా నిధులను మంజూరు చేస్తుందన్నారు.
అనంతరం పురానీ హవేలీ భవనాన్ని ప్రారంభించారు. భవనాన్ని పూర్తిగా పరిశీలించిన మంత్రి అనంతరం పోలీస్ అధికారులకు, ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ది కొత్వాల్ హౌస్ పురానీ హవేలీ భవనాన్ని తిరిగి వాడుకలోకి తీసుకొచ్చి, దానికి పూర్వ వైభవం తీసుకురావడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలియజేశారు. నగరంలో ప్రతి పోలీసు స్టేషన్ పరిధిలో అవసరమైన సీసీ కెమెరాలు పెంచడానికి నిధులు అందిస్తున్నామని తెలిపారు.
అనంతరం నగర కమిషనర్ సీవీ ఆనంద్ మాట్లాడుతూ ది కొత్వాల్ హౌస్ భవనం గతంలో పోలీస్ కమిషనర్ కార్యాలయంగా ఉండేదని గుర్తు చేశారు.1920 నుండి 2002 వరకు నగర పోలీసు ప్రధాన కార్యాలయంగా పనిచేసిందని తెలిపారు. ఈ చారిత్రక కట్టడాన్ని తిరిగి కాపాడినందుకు అందరికీ అభినందనలు తెలియజేశారు. ఇక నుండి వారంలో ఒక రోజు శుక్రవారం పురానీ హవేలీ నుండి, ఒక రోజు బషీర్‌బాగ్‌లోని కార్యాలయం నుండి, మిగతా రోజులు బంజారా హిల్స్‌లోని కార్యాలయం నుండి ప్రజలకు అందుబాటులో ఉంటానని కమిషనర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎంపీ లు అసదుద్దీన్ ఒవైసీ, అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీలు మీర్జా రియాజ్ ఉల్ హసన్ ఎఫెండి, మీర్జా రహమత్ బేగ్, చార్మినార్, బహదూర్ పుర ఎమ్మెల్యే లు మీర్ జుల్ఫెకార్ అలీ, ముబీన్, అదనపు సీపీ విశ్వప్రసాద్, డైరెక్టర్ ఆఫ్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఏ, అర్ శ్రీనివాస్, జాయింట్ సీపీ జోయెల్ డేవిస్, డీసీపీ లు స్నేహా మెహ్రా, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎం.డి రమేష్ రెడ్డి, అపూర్వ రావు, రక్షిత కృష్ణ మూర్తి, ఆర్. వెంకటేశ్వర్లు డీసీపీ చైతన్య కుమార్ తదితరులు పాల్గొన్నారు.