Banjarahills | బంజారాహిల్స్, మార్చి 12 : రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని అటకాయించి దాడికి పాల్పడడంతో పాటు దారిదోపిడీకి పాల్పడిన ఘటన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కర్నూల్‌కు చెందిన షేక్ రఫీ(24) అనే యువకుడు బంజారాహిల్స్ రోడ్ నెం 10లోని జహీరానగర్‌లో నివాసం ఉంటూ బంజారాహిల్స్‌లోని లెవంట్ హోటల్లో హెల్పర్‌గా పనిచేస్తుంటాడు. మంగళవారం అర్థరాత్రి దాటిన తర్వాత డ్యూటీ ముగించుకున్న షేక్ రఫీ రోడ్డుమీద నడుచుకుంటూ వెళ్తున్నాడు. బంజారాహిల్స్ రోడ్ నెం 2లోని అన్నపూర్ణ స్టూడియో వైపునుంచి టీడీపీ భవన్ వైపు నడుచుకుంటూ వెళ్తుండగా వెనకనుంచి స్కూటీ మీద వచ్చిన ముగ్గురు యువకులు అతడిని అటకాయించి అకారణంగా గొడవకు దిగడంతో పాటు దాడికి పాల్పడ్డారు. ఈ గొడవను అపేందుకు ప్రయత్నిస్తున్నట్లు నటించిన ఓ ట్రాన్స్‌జెండర్ రఫీ జేబులోంచి రూ.1500 తీసుకుని అక్కడినుంచి వెళ్లిపోయింది.
ట్రాన్స్‌జెండర్ వెళ్లిపోయిన తర్వాత ముగ్గురు యువకులు రఫీ చేతిలో ఉన్న మొబైల్‌ఫోన్‌తో పాటు రూ.12వేల నగదును లాక్కున్నారు. జీతం రావడంతో కొత్త మొబైల్ ఫోన్ కోనేందుకు తీసుకున్న డబ్బులను, పాత మొబైల్‌ను దుండగులు లాక్కున్నారని, ట్రాన్స్‌జెండర్ రూ.1500 లాక్కుందంటూ బాధితుడు బంజారాహిల్స్పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ట్రాన్స్‌జెండర్‌తో కలిసి వీరంతా ముఠాగా దోపిడీకి పాల్పడి ఉండవచ్చని బాధితుడు పేర్కొన్నాడు. ఈ మేరకు పోలీసులు బీఎన్ఎస్ 309(6) సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.