GHMC | జూబ్లీహిల్స్ : జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ విభాగంలో డిప్యూటీ ఈఈ ల బదిలీలు జరిగాయి. ఇందులో ముగ్గురు డిప్యూటీ ఈఈలకు కొత్త సర్కిల్స్‌లో ఈఈగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. జీహెచ్ఎంసీ 19వ సర్కిల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ యూ రాజ్‌కుమార్ ఇటీవల పదవీ విరమణ పొందారు. నాటి నుంచి ఆయన స్థానంలో సర్కిల్- 21 చందానగర్ ఈ ఈ ఆర్ ఇందిరాబాయి యూసుఫ్‌గూడా సర్కిల్ ఈఈగా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కాగా, తాజాగా చోటుచేసుకున్న డిప్యూటీ ఈఈల బదిలీల్లో సర్కిల్- 11 రాజేంద్రనగర్ డిప్యూటీ ఈఈ గా పనిచేస్తున్న బీ భద్రును అదే స్థానంలో సర్కిల్-19 యూసుఫ్‌గూడకు బదిలీ చేస్తూ ఈఈగా పూర్తి అదనపు బాధ్యతలు కేటాయించారు.
ఇప్పటికే ఇక్కడ డిప్యూటీ ఈఈగా పని చేస్తున్న కే రామచందర్ రాజును సర్కిల్- 11లో డిప్యూటీ ఈఈ బీ భద్రు స్థానంలో రాజేందర్ నగర్‌కు బదిలీ చేశారు. గాజులరామారం సర్కిల్- 26లో డిప్యూటీ ఈఈగా పని చేస్తున్న కే శిరీషను అదే స్థానంలో సర్కిల్ -20 శేరిలింగంపల్లికి బదిలీ చేస్తూ ఈఈగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆమె స్థానంలో శేరిలింగంపల్లి సర్కిల్ -20 డిప్యూటీ ఈఈగా పని చేస్తున్న కే విశాలాక్షిని గాజులరామారం సర్కిల్ -26 డిప్యూటీ ఈఈగా బదిలీ చేశారు. దీంతో పాటు ఫలక్‌నుమా సర్కిల్-10 డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న ఎం వెంకటేశ్వర్లుకు అదే స్థానంలో ఈఈగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఉత్తర్వుల మేరకు చీఫ్ ఇంజినీర్ సహదేవ్ రత్నాకర్ ఆయా డిప్యూటీ ఈఈలకు తాత్కాలిక ప్రాతిపదికన ఆయా సర్కిల్లో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లుగా బాధ్యతలు అప్పగించారు.