సిటీబ్యూరో, మార్చి 31 (నమస్తే తెలంగాణ) : పార్లమెంట్ ఎన్నికల సమర్థ నిర్వహణకు పీవో, ఏపీవోలుగా నియమించిన వారందరికీ సోమ, మంగళవారం ఉదయం, మధ్యాహ్న సమయంలో శిక్షణ ఇచ్చేందుకు 15 కళాశాలలో ఒక్కొక్క కాలేజీలో నాలుగు హాల్లో మొత్తం 60 హాళ్లలో మొత్తం 11,442 మందికి శిక్షణ తరగతులను ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కమిషనర్ రోనాల్డ్‌రోస్ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు, ఉదయం 50 మంది, సాయంత్రం 50 మంది చొప్పున ఒక్కొక్క హాల్ ఉదయం సమయాల్లో సోమవారం 3వేల మందికి శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. మధ్యాహ్న సమయంలో మరో 3వేల మందికి మొత్తం ఆరువేల మందికి శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. 2వ తేదీన ఉదయం సమయంలో ఇదే హాల్లో 3042 మందికి, మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు జరిగే మరో 2400 మందికి మొత్తం 5442 మందికి శిక్షణ ఇవ్వనున్నారు. ఎన్నికల విధుల నిర్వహణలో భాగంగా పీవో, ఏపీవోలకు ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసి శిక్షణ తరగతులకు రావాలని కోరారు. వచ్చే వారు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఫారం-12 ఇవ్వనున్న నేపథ్యంలో ఓటరు ఎఫిక్ కార్డు నంబరు, ఓటరుగా నమోదైన నియోజకవర్గంలోని ఓటరు జాబితాలో పార్టు నంబర్ సీరియల్ నంబర్ కూడా తీసుకొని రావాలని సూచించారు. ఓటరు జాబితాలో పేరు ఉందో లేదో తెలుసుకోవాలంటే http:// voters.eci..gov.in వెబ్సైట్లో చెక్ చేసుకోవాలన్నారు. ఎన్నికల విధులకు సంబంధించిన ఉత్తర్వులతో పాటు ఫారం-12 జత చేస్తూ పంపించినట్లు చెప్పారు.
మేడ్చల్, మార్చి31(నమస్తే తెలంగాణ): 85 సంవత్సరాలు పై బడిన వృద్ధులు, నడవలేని దివ్యాంగులు, కొవిడ్ పేషెంట్లకు ఇంటి వద్దే ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు. ఓటర్ గుర్తింపు కార్డుల ప్రకారం వారిని గుర్తించి ఇంటింటికీ వెళ్లి ఇంటి వద్దనే ఓటు హక్కు వినియోగించుకునే 12 డీ దరఖాస్తులను బీఎల్ఓలు అందజేస్తున్నారు. ఇంటి వద్దే ఓటు హక్కు వినియోగించుకునే వారు ఏప్రిల్ 23 లోపు ఫారం 12 డీ లను ఏఆర్ఓలకు సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తులను రిటర్నింగ్ అధికారి ఆధ్వర్యంలో పరిశీలించి అర్హులను ఏప్రిల్ 25 న ఎంపిక చేస్తారని, ఏఆర్ఓలు షెడ్యూలు రూపొందించి బూత్‌స్థాయి అధికారుల ద్వారా ఓటర్లకు సమాచారం అందించనున్నట్లు తెలిపారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని ఐదు నియోజకవర్గాలైన మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాలలో 80 ప్లస్ దాటిన వృద్ధులు ఓటరు జాబితాలో 32,880 ఓటర్లు ఉండగా దివ్యాంగులు 21,990 మంది ఉన్నారు.
మేడ్చల్, మార్చి31(నమస్తే తెలంగాణ): ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించే వారిపై సీ విజిల్లో పక్కా ఆధారాలతో ఫిర్యాదు చేయాలని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ సూచించారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో ఇప్పటి వరకు సీ యాప్ ద్వారా వచ్చిన 13 కేసులను పరిష్కరించినట్లు వెల్లడించారు. డబ్బు పంపకాలు, ఉచితాలు ఓటర్లను ప్రలోభ పెట్టిన, మద్యం సరఫరా చేసిన, భయభ్రాంతులకు గురి చేసిన, లెక్కకు మించి ఖర్చు, మతపరమైన ప్రసంగాలు చేసిన వీడియోలు, ఆడియో రికార్డు చేసి సీయాప్లో ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఫిర్యాదు చేసిన వంద నిమిషాలలో ఎన్నికల నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ గౌతమ్ పేర్కొన్నారు.