Hyderabad | సిటీబ్యూరో: ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో సోమవారం గంట పాటు కురిసిన భారీ వర్షానికి నగరం అతలాకుతలమైంది. బలమైన గాలుల ధాటికి కొన్ని ప్రాంతాల్లో చెట్లు విరిగిపడ్డాయి. లోతట్టు ప్రాంతాలు, రహదారులు జలమయమయ్యాయి. పలు చోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. టోలిచౌకి నుంచి గోల్కొండ రహదారిలోని ఎండీ లైన్స్‌లో వందేండ్ల నాటి మర్రి చెట్టు కుప్పకూలింది. మూడు వాహనాలు ధ్వంసమయ్యాయి. చెట్టు కింద నిల్చున్న వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.
రాత్రి 9 గంటల వరకు నగరంలోని లంగర్‌హౌస్‌లో అత్యధికంగా 5.80 సెం.మీలు, మెహిదీపట్నంలో 5.70, యూసుఫ్‌గూడ కృష్ణానగర్, ఆసిఫ్‌నగర్‌లో 5.25, జూబ్లీహిల్స్‌లో 4.68, ఫస్ట్‌లాన్సర్ అహ్మద్ నగర్, బంజారాహిల్స్‌లో 4.63, షేక్‌పేట, ఉప్పల్‌లో 3.88, ముషీరాబాద్‌లోని జవహర్‌నగర్‌లో 3.55, మాదాపూర్, విజయనగర్‌కాలనీలో 3.40, బోరబండ, పటాన్చెరులో 3.20, హిమాయత్‌నగర్, నాంపల్లి మూసాపేటలో 3.18, సికింద్రాబాద్, రాజేంద్రనగర్, బాలానగర్‌లో 3.0, మలక్‌పేట, అంబర్‌పేట, హఫీజ్‌పేటలో 2.9 సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైనట్లు టీఎస్‌డీపీఎస్ వెల్లడించింది. నైరుతి వైపు నుంచి వీస్తున్న గాలుల వల్ల రాగల మరో రెండు రోజులు గ్రేటర్‌లోని పలు చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.