సైదాబాద్, జూన్ 2: హైదరాబాద్ మలక్ పేట నల్గొండ చౌరస్తాలో పొంగిపొర్లుతున్న డ్రైనేజ్ పైప్ లైన్ నిర్మాణ పనులు కొంత మేరకు పూర్తి కావడంతో వాహనాల రాకపోకలు మొదలయ్యాయి. జీహెచ్ఎంసీ, జలమండలి అధికారులు సమన్వయంతో శరవేగంగా పైప్ లైన్ పనులు పూర్తి చేయడంతో సోమవారం ఉదయం నుంచి రహదారిపై యథావిధిగా రాకపోకలు కొనసాగుతున్నాయి. ప్రధాన రహదారిపై డ్రైనేజీ పైపు లైన్ పగలడంతో మురుగు నీరు అంతా రోడ్లపై ప్రవహించి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగించడంతో హైడ్రా, జీహెచ్ఎంసీ, జలమండలి ఉన్నత అధికారులు సందర్శించి ఆగమేఘాలపై పనులు ప్రారంభించడంతో ఎట్టకేలకు కొంత మేరకు పూర్తి అయ్యాయి.
సీవరేజ్ పైప్లైన్ అవుట్లెట్ పనుల్లో కొన్ని లోపాలను గుర్తించి వాటికి సంబంధించిన మరమ్మతులను చేయడంలో అధికారులు నిమగ్నమయ్యారు. జీహెచ్ఎంసీ, జలమండలి అధికారులు సమన్వయంతో పొంగిపొర్లుతున్న డ్రైనేజీ సమస్య నుంచి వాహనదారులకు ఏర్పడ్డ ట్రాఫిక్ జామ్ నుంచి విముక్తి కల్పించారు.
పనులు కొనసాగిస్తున్న ప్రాంతంలో రోడ్డుపై నిలిచిన మురుగునీరు
రెండున్నర కోట్లతో సీవరేజ్ పైప్ లైన్ కు ప్రతిపాదనలు
నల్గొండ చౌరస్తా నుంచి మలక్ పేట రైల్వే బ్రిడ్జి (ఆర్ యూ బీ)వరకు సీవరేజ్ పైప్ లైన్ నిర్మాణం కోసం రెండున్నర కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాణ ప్రతిపాదనలు చేశారు. చంచలగూడ జైలు నుంచి అక్బర్ బాగ్, న్యూ మలక్ పేట తదితర ప్రాంతాల నుంచి వచ్చే డ్రైనేజీ మురుగు నీటి సమస్యను శాశ్వతంగా పరిష్కారించే దిశగా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. మురుగునీటి, వరదనీటి కాలువలు వేర్వేరుగా వెళ్లే విధంగా అవసరమైన మార్పులను చేస్తూ వాటి నిర్వహణకు కావలసిన ప్రతిపాదన రూపకల్పనలో అధికారులు నిమగ్నమయ్యారు. అధికారుల ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదించిన వెంటనే పనులు ప్రారంభించి, కష్టాల నుంచి శాశ్వత విముక్తి కల్పించాలని అధికారులు సంకల్పించారు.
ఊపిరి పీల్చుకున్న వాహనదారులు
నల్గొండ చౌరస్తాలోని అక్బర్ ప్లాజా వద్ద డ్రైనేజీ పైప్ లైన్ పగిలిపోవడంతో అక్కడి నుంచి ఆర్యూబీ వరకు మురుగునీరు రోడ్లపై ప్రవహించడంతో వాహనదారులు వారం రోజులకుపైగా తీవ్ర ఇబ్బందులు, అసౌకర్యాలు ఎదుర్కొన్నారు. ఉన్నతాధికారులు పర్యటించి, ఇబ్బందులు పరిశీలించి రెండు రోజుల్లో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. అప్పటినుంచి ఈ దారిపై వాహనాలు రాకపోకలను దారి మళ్లించారు. అయితే ఇవాళ పనులు పూర్తయ్యి యథావిధిగా రాకపోకలు పునర్ ప్రారంభం కావడంతో వాహనదారులు ఊపిరిపించుకుంటున్నారు.