Traffic Restrictions | సిటీబ్యూరో, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ) : మిలాద్ ఉన్ నబీ సందర్భంగా గురువారం నగరంలోని పలు ప్రాంతాల్లో ఊరేగింపులు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. గురువారం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు. ఫలక్‌నుమా నుంచి వోల్టా హోటల్, యాహియా పాషా దర్గా నుంచి వోల్టా హోటల్ వరకు, మక్కా మసీదు నుంచి హజ్ హౌస్, పత్తర్‌గట్టి అలీజా కోట్ల వరకు ఊరేగింపులు ఉండనున్నాయి.
ప్రధాన ఊరేగింపు సయ్యద్ క్వాద్రీ చమన్, గులాం ముర్తుజా కాలనీ, ఫలక్‌నుమా నుంచి ప్రారంభం కానున్నది. అలియాబాద్ ఎక్స్ రోడ్స్, లాల్ దర్వాజా ఎక్స్ రోడ్స్, చార్మినార్, గుల్జార్ హౌస్, మదీనా, నయాపూల్ బ్రిడ్జి, సాలార్జంగ్ మ్యూజియం, పురానీ హవేలీ మీదుగా ర్యాలీ ఉంటుంది. బీబీ బజార్, ఎటెబార్ చౌక్‌ల్లో ర్యాలీ ముగియనున్నది. ఈ నేపథ్యంలో ట్రాఫిక్‌ను మహబూబ్‌నగర్ ఎక్స్ రోడ్ మీదుగా కందికల్ గేట్, పీసల్బండ, కర్నూలు రోడ్డు వైపునకు, శంషీర్‌గంజ్, నాగుల చింత మీదుగా ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రాకపోకల్లో ఏదైనా ఇబ్బందులు తలెత్తితో 9010203626 నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని సూచించారు.