హైదరాబాద్ : నగరంలోని దుర్గంచెరువు తీగల వంతెన పైనుంచి వాహనాల రాకపోకలపై ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రోడ్డు నంబర్ 45 నుంచి ఐటీసీ కోహినూర్ వరకు వాహనాల రాకపోకలను నిలిపివేయనున్నట్లు తెలిపారు. ఫార్ములా రీజియన్ ఇండియా పోటీల వల్ల రాకపోకలను నిలిపివేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. కాసేపట్లో ఫార్ములా రీజియన్ ఇండియా ఛాంపియన్ షిప్ పోటీలు ప్రారంభకానున్నాయి. మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించనున్నారు. ఐటీ, పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ మోటార్ రేసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఈ పోటీలను నిర్వహిస్తున్నది. విషయాన్ని గమనించి వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.