గణేశ్ నిమజ్జనం నేపథ్యంలో ట్రై పోలీస్ కమిషనరేట్లలో 25 వేల మంది పోలీస్ సిబ్బంది బందోబస్తులో పాల్గొంటున్నారు. ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన కార్యక్రమం ఉదయం వేళల్లోనే ప్రారంభించి.. మధ్యాహ్నం వరకు పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందించారు. ఇక లడ్డూ వేలం పూర్తయిన తర్వాతే బాలాపూర్ గణేషుడిని నిమజ్జనానికి తరలిస్తారు.
మరోవైపు ప్రధాన శోభాయాత్ర జరిగే మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని సీపీ ఆనంద్ వెల్లడించారు. నగరంలోని అన్ని జంక్షన్లలో ఆంక్షలు ఉంటాయని.. బషీర్‌బాగ్ కూడలిలో మాత్రమే ఇరువైపులా రాకపోకలకు అనుమతి ఉంటుందన్నారు. వాహనదారులు ఇన్నర్ రింగ్ రోడ్డు, బేగంపేట ప్రాంతం, ఔటర్ రింగ్ రోడ్డును ఉపయోగించుకోవాలని సూచించారు. లారీలు, జిల్లా బస్సులను నగరంలోకి ఉదయం 8 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 8 గంటల వరకు అనుమతి ఉండదన్నారు.
శివారు ప్రాంతాల నుంచి రాకపోకలు సాగించాలని సూచించారు. ట్రాఫిక్ ఆంక్షల నేపథ్యంలో హెల్ప్‌లైన్ నంబర్లు(040-27852482, 8712660600, 9010203626) సంప్రదించాలని సీపీ సూచించారు. కాగా, నిమజ్జనోత్సవాల్లో భాగంగా ఎవరైనా సోషల్ మీడియాలో ప్రజలను రెచ్చగొట్టే పోస్టులు పెట్టినా..తప్పుడు ప్రచారాలు చేసినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనర్లు హెచ్చరించారు.