హైదరాబాద్ : న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో నగర పరిధిలోని మూడు పోలీసు కమిషనరేట్లు ట్రాఫిక్ ఆంక్షలను విధించాయి. డిసెంబర్ 31 రాత్రి 10 గంటల నుంచి జనవరి 1వ తేదీ ఉదయం 5 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. నగరంలోని సైబర్ టవర్స్ ఫ్లై ఓవర్, గచ్చిబౌలి, బయో డైవర్సిటీ, మైండ్ స్పేస్, ఫోరం మాల్ – జేఎన్టీయూ, దుర్గం చెరువు బ్రిడ్జి, బీజేఆర్, బేగంపేట, ప్యారడైజ్, ప్యాట్నీ, తెలుగు తల్లీ, నారాయణగూడ, బషీర్‌బాగ్, ఎల్బీనగర్, మలక్‌పేట, నెక్లెస్ రోడ్డు, మెహిదీపట్నం, పంజాగుట్ట ఫ్లై ఓవర్లతో పాటు పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ వేను మూసివేయనున్నారు. టికెట్లు ఉన్నవారినే పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ వేపైకి అనుమతిస్తారు.
డిసెంబర్ 31 రాత్రి 11 గంటల నుంచి ఎల్లుండిఉదయం 5 గంటల వరకు ఓఆర్ఆర్ పైకి కార్లను అమనుతించరు. ఓఆర్ఆర్ పైకి కేవలం లారీలు, గూడ్స్ వాహనాలకు మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు. టికెట్లు ఉన్నవారికే ఓఆర్ఆర్ పై నుంచి ఎయిర్‌పోర్టుకు అనుమతి ఉంటుంది.
క్యాబ్ డ్రైవర్లు తప్పనిసరిగా యూనిఫాం ధరించడంతో పాటు అవసరమైన డాక్యుమెంట్లు ఉంచుకోవాలి. రాత్రి వేళల్లో క్యాబ్ బుక్ చేస్తే రద్దు చేయకూడదు. క్యాబ్ సర్వీస్‌ను రద్దు చేస్తే రూ. 500 జరిమానా విధించనున్నారు. రాచకొండ పరిధిలో వాట్సాప్ నంబర్ 94906 17111, సైబరాబాద్ పరిధిలో 9490617346 కు ఫిర్యాదు చేయొచ్చు.
నగర వ్యాప్తంగా రేపు రాత్రికి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టనున్నారు. మూడు కమిషనరేట్ల పరిధఙలోని అన్ని రహదారుల్లో ఈ కార్యక్రమం కొనసాగనుంది. వాహనదారులు సరైన పత్రాలు చూపించని యెడల, వాహనాలను సీజ్ చేయనున్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.