హైదరాబాద్: పూల పండుగ బతుకమ్మ నేటితో ముగియనుంది. తొమ్మిది రోజులపాటు బతుకునిచ్చే బతుకమ్మ అంటూ ఆడిపాడిన ఆడపడుచులు.. పోయిరా బతుకమ్మ అంటూ ముగింపు పలుకనున్నారు. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా సద్దుల బతుకమ్మను నిర్వహించనున్నారు. ట్యాంక్‌బండ్‌పై రాష్ట్ర ప్రభుత్వం తరఫున వేడుక నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు (Traffic Restrictions) విధించారు.
అమరవీరుల స్మారకస్థూపం నుంచి అప్పర్ ట్యాంక్‌బండ్‌లోని బతుకమ్మ ఘాట్ వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని చెప్పారు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11 గంటలకు ఆంక్షలు కొనసాగుతాయని వెల్లడించారు. ఈ నేపథ్యంలో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు. పండుగ వేడుకలు ప్రశాంతంగా ముగిసేలా ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.