Hyderabad | హైదరాబాద్ : పాతబస్తీ లాల్ దర్వాజ బోనాల వేడుకల సందర్భంగా పాత నగరంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ నగర ట్రాఫిక్ అదనపు సీపీ సుధీర్‌బాబు ఉత్తర్వులు జారీ చేశారు. పాతబస్తీలో ఆదివారం బోనాలు, సోమవారం ఘట్టాల ఊరేగింపుకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ నేపథ్యంలో ఆది, సోమవారాల్లో పాతబస్తీ, అంబర్‌పేట ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు.
ట్రాఫిక్ ఆంక్షలు చార్మినార్, మీర్‌చౌక్, ఫలక్‌నూమా, బహుదూర్‌పూర ట్రాఫిక్ పోలీస్స్టేషన్ల పరిధిలో అమలులో ఉంటాయని పేర్కొన్నారు. ట్రాఫిక్ ఆంక్షల దృష్ట్యా విధి నిర్వాహణలో ఉన్న ట్రాఫిక్ పోలీసులకు ప్రజలు సహకరిస్తూ, వారి సూచనలు పాటించాలని ఆయన సూచించారు. ఆర్టీసీ బస్సులు చార్మినార్, ఫలక్‌నుమా, నయాపూల్ వైపు అనుమతించరు. ఆయా రూట్లలో వచ్చే బస్సులను ఓల్డ్ సీబీఎస్, అఫ్జల్‌గంజ్, దారుల్ షాఫ ఎక్స్ రోడ్స్, ఇంజన్‌బౌలి వద్ద నిలిపివేస్తారు. ప్రత్యామ్నాయ రూట్లలో వెళ్లాలని అదనపు సీపీ సూచించారు. వేడుకలకు వచ్చే వారు తమకే కేటాయించిన పార్కింగ్ స్థలాలల్లో వాహనాలను పార్కు చేయాలని సూచించారు.
అంబర్పేట్ ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ పరిధిలో 16వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 18వ తేదీ ఉదయం 6 గంటల వరకు అమలులో ఉంటాయి. ఉప్పల్ నుంచి అంబర్పేట్ మీదుగా వెళ్లే ఆర్టీసీ బస్సులను ఉప్పల్ చౌరస్తా, హబ్సిగూడ, తార్నక, అడిక్‌మెట్, విద్యానగర్, ఫీవర్ హాస్పిటల్, కాచిగూడ, చాదర్‌ఘాట్ వైపు మళ్లిస్తారు. కోఠి నుంచి వెళ్లే వాహనాలను కాచిగూడ, ఫీవర్ హాస్పిటల్, అడిక్‌మెట్, తార్నాక, హబ్సిగూడ, ఉప్పల్ క్రాస్‌రోడ్‌కు రాకపోకలు సాగించాలి. ఉప్పల్ నుంచి అంబర్పేట్ వెళ్లే వాహనాలను రాయల్ జ్యూస్ కార్నర్, డీడీ కాలనీ, సిండికేట్ బ్యాంక్, శివం రోడ్డులోకి సాధారణ ట్రాపిక్ వెళ్లాలని పోలీసులు సూచించారు. గోల్నాక, మూసారాంబాగ్ వెళ్లే వాహనాలను సీపీఎల్ అంబర్పేట్, సల్దాన గేట్, అలీ కేప్ రూట్లో రాకపోకలు సాగించాలని పోలీసులు సూచించారు.