బాబోయ్.. ఇదేం ట్రాఫిక్.. పగలు, రాత్రి అనే తేడా లేకుండా ట్రాఫిక్ రద్దీ ఉండటంతో నగరవాసులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ సమస్య రోజురోజుకూ జటిలమవుతున్నది. కనీసం అంబులెన్స్ వెళ్లాలన్నా కష్టంగా మారుతున్నది. అర కిలోమీటరు దూరానికి కూడా అరగంటపైనే పడుతున్నది. కీలకమైన సమయాల్లో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించాల్సిన పోలీసులు ఎక్కడా కనిపించడం లేదు. వాహనాల వలయాన్ని ఛేదించే వ్యూహాన్ని అమలు చేయడం లేదు. ఫలితంగా నగరంలో ట్రాఫిక్ జంఝాటం ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్నది.
సిటీబ్యూరో: ట్రాఫిక్.. ట్రాఫిక్… ఇది నగరవాసులను ప్రతిరోజూ తీవ్ర టెన్షన్‌కు గురిచేస్తున్నది. ఉదయం, సాయంత్రం అయితే నగరంలోని కేబీఆర్ పరిసర ప్రాంతాల్లోని రోడ్ల వెంబడి ప్రయాణించాలంటే నరకమే. బంజారాహిల్స్‌లోని పెన్షన్ హౌస్ చౌరస్తా దాటాలంటే 5 నుంచి 10 నిమిషాల సమయం పడుతున్నది. రోడ్డు నంబర్. 10లో రోడ్లు చిన్నవిగా, మరికొన్ని చోట్ల మరింత ఇరుకుగా ఉండటంతో ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతున్నది. దీంతో ఉదయం.. సాయంత్రం వేళల్లో నగర రోడ్లపై ట్రాఫిక్ రద్దీ విపరీతంగా ఉంటున్నది. రద్దీ తగ్గించే చర్యలు లేకపోవడంతో గంటల తరబడి రహదారులపై ఉండాల్సిన దుస్థితి ఏర్పడుతున్నది.
సైబరాబాద్‌లోని ఐటీ కారిడార్‌కు వెళ్లే వారికి దుర్గంచెరువు వంతెనతో కష్టాలు తీరాయి. ఐటీ కారిడార్లోకి వెళ్లే వాహనదారులు ఈ రూట్ నుంచే వెళ్లేందుకు ఉత్సాహం చూపుతారు. అలాగే జూబ్లీహిల్స్ చెక్‌పోస్టుతో పాటు మెహిదీప్నటం నుంచి ఐటీ కారిడార్‌కు వెళ్లి వస్తుంటారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో పలు సంస్థలు ఉండటంతో ఇక్కడికి వచ్చిపోయే వారి సంఖ్య ప్రతి నిత్యం ఎక్కువగా ఉంటున్నది. వీఐపీల మూమెంట్ కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో కేబీఆర్ చుట్టుపక్కలతో పాటు రోడ్డు నం. 1, 2, 10, 12, 45 జంక్షన్లతో పాటు మాసబ్‌ట్యాంక్ ఫ్లైఓవర్ జంక్షన్, మెహిదీపట్నం ప్రాంతాల్లో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది.
ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు బంజారాహిల్స్‌లోని రోడ్లన్నీ వాహనాలతో నిండి ఉంటున్నాయి. కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ముందు నుంచి వీరంచి జంక్షన్‌కు వచ్చే రూట్లో వాహనాలు కిలోమీటర్ పొడవునా.. బారులు తీరి ఉంటాయి. కేబీఆర్ పార్కు నుంచి రోడ్డు నంబర్ .10 మీదుగా సిటీ సెంటర్ జంక్షన్‌కు వెళ్లే మార్గంలో పరిస్థితి దారుణంగా ఉంటుంది. రాత్రి 10 గంటల తరువాత నగరంలోకి రావాల్సిన భారీ వాహనాలు 9 గంటల వరకే వస్తుంటాయి. దీంతో అప్పటికే బంజారాహిల్స్ పరిసరాల నుంచి వచ్చి పంజాగుట్ట, లక్డీకాపూల్ రూట్లలో నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లేవారికి అక్కడ కూడా కనీస ఉపశమనం ఉండటం లేదంటూ వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.