Traffic Violations | సిటీబ్యూరో, మార్చి 28(నమస్తే తెలంగాణ): తాము ప్రయాణం చేసే సమయంలో పక్కనే ప్రయాణిస్తున్న వ్యక్తులు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే గతంలో మనకెందుకులే అన్న రీతిలో ఉండేది. కానీ ఇప్పుడలా కాదు.. పోలీసులే ఫొటోలు తీయనవసరం లేదు. తోటి ప్రయాణికులే ఫొటోలు తీసి ఉల్లంఘనదారులపై తమదైన శైలిలో ఫిర్యాదు చేస్తున్నారు.
హెల్మెట్ పెట్టుకోని వారు మొదలు రాంగ్‌రూట్, త్రిపుల్ రైడింగ్, వాహననెంబర్ సరిగా లేకపోవడం వంటి వాటిని తమ సెల్ఫోన్లో క్లిక్‌మనిపించి వాట్సప్, ఎక్స్ వేదికగా ట్రాఫిక్ విభాగానికి ఫిర్యాదు చేస్తున్నారు. వీటిని పరిశీలిస్తున్న ఉన్నతాధికారులు బాధ్యులైన వారిపై ఈ చలాన్లు వేసి జరిమానాలు విధిస్తున్నారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ పోలీసుల కంటే నెటిజన్లు చేసే ఫిర్యాదులే రోజురోజుకూ పెరుగుతున్నాయి.
నెటిజన్లు చేస్తున్న ఫిర్యాదుల్లో ఎక్కువగా హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తున్న వారి ఫిర్యాదులే ఉంటున్నాయని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. హెల్మెట్ లేకపోవడం వల్ల కలిగే నష్టాలను పోలీసులు ఎన్నిసార్లు చెప్పినా పెడచెవిన పెడుతున్న వాహనదారులకు ఇప్పుడు తోటి ప్రయాణికులే షాక్ ఇస్తున్నారు. పోలీసులు తమ స్పెషల్ డ్రైవ్‌లలో జరిమానాలు వేసినా కొందరు పోలీసులకు దొరకకుండా తప్పించుకుంటున్నారు.
ఇలాంటివారిపై నెటిజన్లు ఫొటోలతో ఏరియావారీగా మెసేజ్ చేసి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ప్రతీరోజూ ట్రాఫిక్ విభాగానికి అందుతున్న ఫిర్యాదుల్లో హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్నవే ఎక్కువగా ఉన్నాయని అధికారులు చెప్పారు. ఇవే కాకుండా ట్రిపుల్ రైడింగ్ చేస్తున్న వాహనదారులను సైతం నెటిజన్లు వదలడం లేదు. వారివల్ల వచ్చే ఇబ్బందులు కోడ్చేస్తూ సోషల్‌మీడియాలో పోస్ట్చేస్తున్నారు. తమకు ట్యాగ్చేసిన పోస్టులలో వాహనదారులు నియమాలు ఉల్లంఘిస్తున్న తీరు ఫొటోలలో స్పష్టంగా కనిపిస్తున్నదని అధికారులు తెలిపారు. ఫిర్యాదులపై విచారణ చేసి నిబంధనలప్రకారం వారికి జరిమానాలు విధిస్తున్నారు.
తోటి ప్రయాణికులే కాదు.. పోలీసులను సైతం నెటిజన్లు వదలడం లేదు. సాధారణ ప్రజలు నిబంధనలు ఉల్లంఘిస్తే వారికి జరిమానాలు వేసే ట్రాఫిక్, సివిల్‌పోలీసులు మాత్రం ట్రాఫిక్ నిబంధనలు ఎలా ఉల్లంఘిస్తారంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందరికీ ఒకటే రూల్ అంటూ హెల్మెట్ లేకుండా వాహనాలపై ప్రయాణిస్తున్న పోలీసులను గుర్తించి ఆధారాలతో సహా ఏ ఏరియాలో ఫొటో తీశామో చెబుతూ వారిపై చర్యలు తీసుకోవాలని వాట్సప్‌లో, ఎక్స్‌లో ఉన్నతాధికారులకు పోస్ట్‌లు పెడుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన పోలీసులపై వచ్చిన ఫిర్యాదులు ఎక్కువగా ఉన్నాయని అధికారులు చెప్పారు. వీరి విషయంలో తాము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటున్నామని వారు పేర్కొన్నారు.
పోలీసులు చేపట్టిన స్పెషల్ డ్రైవ్‌లో ఒక వారంలోనే వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఈ నెల 18వ తేదీ నుంచి 24వ తేదీ వరకు పోలీసుల స్పెషల్ డ్రైవ్‌లో నమోదైన కేసులు చూస్తే ట్రాఫిక్ ఉల్లంఘనలు ఎంత విపరీతంగా జరుగుతున్నాయో తెలుస్తుంది. రాంగ్‌సైడ్ డ్రైవింగ్‌లో కేవలం వారం రోజుల్లోనే 17,702 కేసులు నమోదు కాగా, నెంబర్ ప్లేట్ ట్యాంపరింగ్‌లో 2,471 కేసులు నమోదయ్యాయి. ఒక నెల రోజుల్లోనే సుమారుగా 35వేల కేసులు నమోదయ్యాయని ట్రాఫిక్ ఉన్నతాధికారులు చెప్పారు.