Cyberabad Police | సిటీబ్యూరో: టెక్నాలజీని వాడుకోవడంలో సైబరాబాద్ పోలీసులు మరో ముందడుగు వేశారు. ప్రస్తుతం కమిషనరేట్ పరిధిలో సవాలుగా మారిన ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు వినూత్న రీతిలో డ్రోన్ కెమెరాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ డ్రోన్ల సహకారంతో ఎక్కడైనాట్రాఫిక్ స్తంభిస్తే..ఆ ప్రదేశానికి వెంటనే డ్రోన్ కెమెరాలను పంపించి అక్కడి పరిస్థితులను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలిస్తారు. అదే సమయంలో సంబంధిత ట్రాఫిక్ సిబ్బందిని సమస్య ఉన్న ప్రదేశానికి పంపించి.. పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటారు.
అలాగే అసలు ట్రాఫిక్ స్తంభించడానికి గల కారణాలపై ప్రత్యేక దృష్టి పెడతారు. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సొసైటీ ఫర్ సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్ సహకారంతో ట్రాఫిక్ పర్యవేక్షణ కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఈ డ్రోన్ కెమెరాలను వారం రోజుల కిందట అందుబాటులోకి తీసుకురాగా, సత్ఫలితాలిస్తున్నట్లు సైబరాబాద్ జాయింట్ కమిషనర్ (ట్రాఫిక్) జోయల్ డేవిస్ వెల్లడించారు.