సిటీబ్యూరో, ఆగస్ట్ 8 (నమస్తే తెలంగాణ): ‘మాకు సహకరించడానికి హైడ్రా సిబ్బందిని పంపించారు. కానీ వారే మొత్తం చేస్తామంటూ మాపై పెత్తనం చెలాయిస్తున్నారు.. ఒక్కో జంక్షన్‌కు ఐదుగురు సిబ్బందిని ఇచ్చామంటూ చెబుతున్నారే కానీ వారి సిబ్బంది ఎక్కడో అక్కడ కనిపిస్తారు. అన్నిచోట్లా ఉండరు.. మావారు ఉండాలన్నా వారి పెత్తనంతో ఉండలేకపోతున్నారు.. అసలేం హైడ్రా అధికారులేం చేస్తున్నారో.. హైడ్రా బాధ్యతేంటో వారికే అర్థం కావడం లేదు. మాకు స్పష్టత ఉన్నా వారు వినరు. అన్నింటిలో జోక్యం చేసుకుని ఆగమాగం చేస్తున్నారు. దీంతో సిటీలో ట్రాఫిక్ నియంత్రణ మొత్తం పట్టు తప్పింది. మేం చెబితే ఆయన వినరు. ఆయనది చెప్పింది విందామంటే మా బాస్‌లు ఒప్పుకోరు.. మాకెందుకీ తలనొప్పి.. అందుకే మా పరిధిలో మా పని మేం చేసుకుంటున్నాం’
– సిటీ పోలీసు విభాగానికి చెందిన ఓ ఉన్నతాధికారి
వర్షాకాలంలో వరద ముంపు లేకుండా చేస్తామని చెప్పిన జూన్ 11వ తేదీనే హైడ్రా ప్రకటించింది. ఈ క్రమంలో మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్‌తో పాటు తన దగ్గరున్న 51 డిఆర్ఎఫ్ బృందాలతో వరద ముప్పు లేకుండా చేస్తామని కమిషనర్ ప్రకటించారు. వరద ముప్పును తొలగించి వాహనరాకపోకలకు ఇబ్బంది తలెత్తకుండా చూసుకుంటామని , అలాగే నివాస ప్రాంతాల్లో వరద నిలవకుండా చూస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రకటించారు.
వర్షమొస్తే సిటీలో మొత్తం ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఏ జంక్షన్ చూసినా వాహనాల వరుసలే కనిపిస్తున్నాయి. వర్షం ఏ స్థాయిలో పడినా ఇదే పరిస్తితి రిపీట్ అవుతోంది. మరి లోపమెక్కడుంది.. ఇది ప్రతీ ఒక్కరు వేస్తున్న ప్రశ్న. గతంలో ఎప్పుడూ ఇంత తీవ్రమైన పరిస్థితి లేదని వరదలు వచ్చినప్పుడు కూడా పోలీసుల సమన్వయంతో ట్రాఫిక్ ఎప్పటికప్పుడు క్లియర్ అయ్యేదని పోలీసులు చెప్పారు. కానీ హైడ్రా వచ్చి ట్రాఫిక్ నియంత్రణ కూడా చేస్తానని చెప్పినప్పటి నుంచి వారు చేయరు.. మమ్మల్ని చేయనీయరంటూ పోలీసులు మండిపడుతున్నారు. ఈ వారంలో కురిసిన వర్షాలు హైడ్రా పనితీరుకు అద్దం పడుతున్నాయి. అవగాహనలేమితో ఇతర శాఖలతో సమన్వయం లేకుండా హైడ్రా వ్యవహరిస్తున్న తీరుపై ఆయా శాఖల అధికారులు అంతర్గతంగా చర్చిస్తుండగా నగరవాసి హైడ్రాకు అనుభవం ఉండా అంటూ మండిపడుతున్నారు. ఒక్క గురువారం కురిసిన వర్షానికి ఎల్లారెడ్డిగూడ, యూసుఫ్‌గూడ, కృష్ణానగర్, శ్రీనగర్ కాలనీ తదితర ప్రాంతాల్లో 500కు పైగా బైక్‌లు నీటమునిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. మరికొన్ని బైకులు వరద నీటిలో కొట్టుకుపోగా.. వందలాది ఇళ్లల్లోకి వరద నీరు వచ్చి చేరింది. అసలు హైడ్రా చెప్పిందేమిటి.. చేస్తున్నదేమిటంటూ నగరవాసులు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా నగరంలో వర్షంపడితే నగరవాసులు పడుతున్న ఇబ్బందులకు కారణం హైడ్రా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నగరంలో ఎక్కడ చూసినా వాటర్ లాగింగ్‌తో సమయానికి వరదనీరు బయటకు పోయే అవకాశం లేకపోవడంతో వాహనాలు కిలోమీటర్ల మేర బారులు తీరి ఒక్కో కిలోమీటర్ ప్రయాణానికి గంటల తరబడి సమయం పట్టిందని వాహనదారులు సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు. ఈ పరిస్థితికి కారణమెవరనే విషయంలో ట్రాఫిక్ పోలీసులు హైడ్రాతీరుపై మండిపడుతుంటే తాము కేవలం ట్రాఫిక్ నియంత్రించడంలో సహకరిస్తామని హైడ్రా చెబుతోంది. కానీ క్షేత్రస్థాయిలో స్వయంగా హైడ్రా కమిషనరే ట్రాఫిక్‌ను నియంత్రిస్తూ ఫొటోలను సోషల్‌మీడియాలో షేర్ చేస్తున్నారు.ట్రాఫిక్ నియంత్రణకు సంబంధించి హైడ్రా 150 మందికి ట్రైనింగ్ ఇచ్చింది. వీరిలో మొదటి బ్యాచ్ 50మందిని ట్రాఫిక్ కంట్రోలింగ్‌లో పోలీసులకు సహాయంగా పెట్టినప్పటికీ మూణ్నాళ్ల ముచ్చటగానే మారింది. వీరు కేవలం సాధారణసమయాల్లో రోడ్డుపై ట్రాఫిక్‌ను నియంత్రించడానికే తప్ప వర్షం వచ్చిన సమయంలో హైడ్రా టీమ్స్‌తో కలిసి పనిచేయాల్సిందిగా చెప్పినట్లుగా డిఆర్ఎఫ్ అధికారి ఒకరు చెప్పారు. నగరంలో భారీ వర్షాలు కురుస్తుంటే ట్రాఫిక్ నియంత్రణ కోసం ఒక్కో జంక్షన్లో ఐదుగురు మాన్సూన్ ఎమర్జెన్సీ బృంద సభ్యులను ట్రాఫిక్ కానిస్టేబుల్‌కు తోడుగా ఉంచుతామని ఆయన పేర్కొన్నారు. కానీ ఆ పరిస్థితి అన్ని చోట్లా కనిపించడం లేదని నగరవాసులు చెప్పారు. ఇదంతా ఒక ఎత్తైతే అసలు తమ డ్యూటీలు తమను చేసుకోనీయకుండా హైడ్రా అడ్డుపడుతున్నదని, ఎక్కడైనా డ్యూటీ చేసే సమయంలో హైడ్రా సిబ్బంది తమపై పెత్తనం చెలాయిస్తూ వారు చెప్పినట్లు చేయాలని డిమాండ్ చేస్తుంటే తాము ఎలా చూడాలంటూ ట్రాఫిక్ పోలీసులు ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో మూడువేల మంది ట్రాఫిక్ సిబ్బంది ఉంటే ట్రైకమిషనరేట్ పరిధిలో సుమారుగా పదివేల సిబ్బంది ఉంటారు. వీరికి తోడుగా ఎమర్జెన్సీ సమయాల్లో సివిల్ పోలీసులను కూడా సహకరించాలని కోరుతామని, అందులోనూ గతంలో ట్రాఫిక్‌లో పనిచేసినవారికి ప్రాధాన్యమిస్తామని ట్రాఫిక్ ఉన్నతాధికారి చెప్పారు. కానీ ఇప్పుడలా సివిల్ పోలీసు రాకుండా, ట్రాఫిక్ పోలీసు డ్యూటీలు చేయకుండా హైడ్రా అడ్డుకుంటున్నదని, పైకి కో ఆర్డినేషన్ ఉందని చెబుతూనే అంతర్గతంగా తమ ఆధిపత్యాన్ని కనబరుస్తున్నారని పోలీసు అధికారి ఒకరు చెప్పారు. ఈ వారంలో కురిసిన వర్షాల సమయంలో ట్రాఫిక్ నియంత్రణ కూడా తామే చేస్తున్నామని హైడ్రా కమిషనర్ చెప్పుకుంటూ తమను ఆయన కంట్రోల్లో పనిచేయమంటే మా బాస్‌లకు మేమేం చెప్పుకోవాలని వారు ఆవేదనగా తెలిపారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా రంగనాథ్ చేతిలో ఫెయిలందని, ఇంతకుముందు అన్ని శాఖలూ కో ఆర్డినేషన్‌తో పనిచేసేవారని, ఇప్పుడు మాత్రం ఏ శాఖలో అడిగినా హైడ్రా చూసుకుంటుందని చెబుతున్నారని, అందుకు తగ్గట్టుగా కేవలం ఫొటోల కోసం హైడ్రా బృందాలు అన్ని శాఖల్లో వేలుపెట్టి ఆ తర్వాత చేతులెత్తేస్తున్నారని ఆ అధికారులు వాపోయారు.
2020 నుంచి ప్రతీ వర్షాకాలంలో వరుసగా హైదరాబాద్ మహానగరంలో 10 నుంచి 16 సెం.మీల మధ్య వర్షపాతం నమోదవుతూనే ఉంది. 2020లో అయితే ఏకంగా 32 సెం.మీల వర్షపాతం నమోదైన విషయం తెలిసిందే. అంత పెద్ద వర్షపాతంలోనూ నగరంలో ట్రాఫిక్‌ను నిర్వహించగలిగిన అధికార యంత్రాంగం ఇప్పుడెందుకు విఫలమవుతోందనేది అంతుచిక్కని ప్రశ్న. ట్రై కమిషనరేట్ల పరిధిలో ప్రస్తుతం ఉన్న అధికారుల్లో సింహభాగం మంది పాత వారే. నగరంపై పూర్తిస్థాయి పట్టు ఉన్నవారే. మరీ ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న ట్రై కమిషనరేట్ల బాస్‌లు గతంలో ట్రాఫిక్ అధికారులుగా పనిచేసినవారే కావడంతో వారికి మహానగర ట్రాఫిక్ నిర్వహణపై పూర్తిస్థాయి పట్టు ఉంది. అయినప్పటికీ గత కొన్ని రోజులుగా నగరంలో ట్రాఫిక్ నిర్వహణపై అధికారులు పట్టు తప్పడంపై ప్రజలు పెదవి విరుస్తున్నారు. కాగా హైడ్రా ఎంట్రీతో కొన్ని ప్రభుత్వ శాఖల్లో సమన్వయం సన్నగిల్లుతోంది. అంతా తామే చూసుకుంటాం, అన్ని బాధ్యతలు మావే అంటూ హైడ్రా చూపిస్తున్న అత్యుత్సాహానికి ఆయా ప్రభుత్వ శాఖల మధ్య అగ్గిరాజుకుంటోంది. అన్ని వారే చూసుకున్నప్పుడు ‘మనకెందుకులే’ అనే ధోరణి ఆయా శాఖల మధ్య తలెత్తుతోంది. ఇతర శాఖల విషయం అటుంచితే పోలీసు, జీహెచ్ఎంసీ, హైడ్రాల మధ్య సమన్వయం కొరవడడంతో అంతిమంగా దాని ప్రభావం ప్రజలపై పడుతోంది. ఈ క్రమంలోనే గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో నగరంలో ట్రాఫిక్ సమస్యలు తీవ్రమవుతున్నాయి. చిన్న పాటి వర్షం కురిసినా వాహనదారులు ట్రాఫిక్ సుడిగుండంలో చిక్కుకుపోతున్నారు. వర్షాలు కురిసి, రోడ్లపై వరద నీరు చేరినప్పుడు రంగంలోకి దిగి వరదనీటిని క్లియర్ చేసే పోలీసులు సైతం తమకెందుకులే అది హైడ్రా చూసుకుంటుందని వారి విధులను వారు నిర్వర్తిస్తున్నారు. అంతే కాకుండా మీ విధులు మీరు నిర్వర్తించండి, అనవసర విషయాల్లో జోక్యం వద్దు అంటూ ఉన్నత స్థాయి నుంచి పోలీసులకు మౌఖిక ఆదేశాలు అందినట్లు సమాచారం. దీంతో పోలీసులు వర్షాలు కురిసిన సమయంలో కేవలం ట్రాఫిక్ జంక్షన్లకే పరిమితమవుతున్నారు. వాటర్ లాగింగ్ పాయింట్స్ జోలికి వెళ్లడం లేదు. దీనికి తోడు చాలా మంది అధికారులు, సిబ్బంది వర్షం కురిసిన సమయంలో రోడ్లపైకి రాకపోవడంతో విజిబుల్ పోలిసింగ్ లేక ట్రాఫిక్ సమస్య మరింత జఠిలంగా మారుతుంది. దీనికి తోడు అంతా మేమే చూసుకుంటామంటూ ప్రగల్బాలు పలుకుతున్న హ్రైడా వర్షాలు కురిసినప్పుడు రోడ్లపై నిలిచిన వరదనీటిని తొలగించడం లేదా క్లియర్ చేయడంలో పూర్తిగా విఫలమవుతోంది. గతంలో సమన్వయంతో కలిసి పనిచేసిన పోలీసు, జీహెచ్ఎంసీ అధికారులు హైడ్రా ఎంట్రీతో తమకెందుకులే అంటూ చేతులెత్తేస్తున్నారు.