హైదరాబాద్: గణేష్ నవరాత్రులు ముగిశాయి. నగరం నలుమూలల నుంచి ట్యాంక్‌బండ్‌కు గణనాథులు తలరివస్తున్నారు. దీంతో హుస్సేన్‌సాగర్ చుట్టుపక్కల కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ (Traffic Jam) అయింది. నిమజ్జనానికి వచ్చే వినాయకులతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. ఖైరతాబాద్ నుంచి ఎంజే మార్కెట్ వరకు వాహనాలు నిలిచిపోయాయి. మంగళవారం ‘మహా’ నిమజ్జనం ఉండడం, నిన్న ఆదివారం కావడంతో నగరంలోని చాలా విగ్రహాలు ట్యాంక్‌బంక్‌కు చేరుకున్నాయి. అయితే విగ్రహాలను తరలిస్తున్న వాహనాలను నియంత్రించేందుకు ఎవరూ లేకపోవడం, వాటిల్లో చాలావరకు భారీ వాహనాలు ఉండడంతో.. దారిపొడవునా గంటల తరబడి సమయం పడుతున్నది. దీంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. 20 నిమిషాల ప్రయాణానికి రెండు గంటల సమయం పడుతున్నది.
ట్రాఫిక్ ఆంక్షల నేపథ్యంలో.. ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్తున్న వాళ్లకు సైతం నరకం కనిపిస్తోంది. రద్దీకి తగినట్లు పోలీసుల పర్యవేక్షణ లేక వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. కాగా, మంగళవారం ఖైరతాబాద్ మహా గణపతితో పాటు భారీ విగ్రహాల నిమజ్జనం కొనసాగనుంది. ఇప్పటికే తగిన ఏర్పాట్లు చేసినట్లు జీహెచ్ఎంసీ ప్రకటించింది. శోభాయాత్ర భద్రత కోసం పాతికవేల మంది సిబ్బందిని పోలీస్ శాఖ ఏర్పాటు చేసింది.