
సిటీబ్యూరో, నవంబరు9 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మెరుగైన రవాణా సౌకర్యాన్ని కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ మహానగర పాలక సంస్థ ఆధ్వర్యంలో రోడ్ల అభివృద్ధికి వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం ద్వారా నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులను అధిగమించేందుకు ఫె్లై ఓవర్లు, అండర్ పాస్‌ల నిర్మాణాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో మిధాని జంక్షన్ నుంచి ఒవైసీ దవాఖాన జంక్షన్ వరకు ఒవైసీ దవాఖాన జంక్షన్ వద్ద రూ. 63కోట్ల అంచనా వ్యయంతో సుమారు 1.40 కిలోమీటర్ల దూరం గల ఫె్లై ఓవర్ నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. 12మీటర్ల వెడల్పు, యూని డైరెక్షన్లో మూడు లైన్ల ఫె్లై ఓవర్ డిసెంబర్ చివరి వారంలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఫె్లై ఓవర్ బ్రిడ్జి కింది భాగంలో బీటీ రోడ్డు పనులు పురోగతిలో ఉందని, ఏ1 ర్యాంపు సీ.ఆర్. సీ.పీ పనులు పూర్తి కాగా ఏ2 ర్యాంపు పనులు పురోగతిలో ఉన్నాయని పేర్కొన్నారు.