Hyderabad | సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జూలై 25 (నమస్తే తెలంగాణ): వరుణుడి ప్రతాపంతో నగరం తడిసి ముద్దవుతున్నది. గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రహదారులపై ట్రాఫిక్ నెమ్మదిగా కదులుతున్నది. సాధారణంగా రోడ్లపై నిలుస్తున్న నీటితో పాటు ప్రధానంగా నగరవాసులు వ్యక్తిగత వాహనాలపై అందునా సొంత కార్లపై ఎక్కువఆధారపడుతుండటంతో ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతున్నది. ముఖ్యంగా ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు ఒకేసారి రోడ్లపైకి రావడంతో సమస్య మరింత జఠిలమవుతున్నది. ఇందులో భాగంగా ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ నియంత్రణకుగాను సైబరాబాద్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఐటీ, ఐటీఈఎస్ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగుల లాగ్ అవుట్ (కార్యాలయాల నుంచి బయటికి వచ్చే సమయం) వేళలను దశల వారీగా అమలు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు మంగళ, బుధవారాల్లో ఐటీ కారిడార్‌లో మూడు దశల్లో లాగ్ అవుట్‌ను అమలు చేయాలని కంపెనీలకు సూచించారు. దీనికి సంబంధించిన సూచనలను లిఖితపూర్వకంగా మాదాపూర్ జోన్ పోలీస్ డిప్యూటీ కమిషనర్ సందీప్ కంపెనీలకు పంపారు.
గత మూడు రోజులుగా నగరంలో విస్తారంగా వర్షాలు కురియడంతో పాటు మరో 24 గంటల పాటు కూడా భారీ వర్షాలు ఉన్న దరిమిలా ట్రాఫిక్ సమస్య జఠిలం కాకుండా ఉండేందుకు పోలీసు శాఖ చర్యలు తీసుకుంటుంది. ప్రధానంగా వెస్ట్ జోన్ పరిధిలో ఒకేచోట వందలాది ఐటీ, ఐటీఈఎస్ కంపెనీలు ఉండటంతో ఉద్యోగులు ఒకేసారి కార్యాలయాలకు రావడం, ఒకేసారి ఇంటికి వెళ్లడంతో ఉదయం, సాయంత్రం వేళల్లో భారీ స్థాయిలో ట్రాఫిక్ జాం అవుతున్నది. గత కొన్నిరోజులుగా పరిశీలిస్తే.. సాయంత్రం వర్షం ఊపందుకోవడం, అదే సమయంలో విధులు ముగించుకొని ఉద్యోగులు రోడ్లపైకి రావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడంతో పాటు ట్రాఫిక్ నియంత్రణ కూడా పోలీసు అధికారులకు సవాల్‌గా మారింది. ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకుంటే.. అది సాధారణ వాహనదారులకు సైతం ఉపశమనం కలిగిస్తుంది. ఇందులో భాగంగా ఐటీ కారిడార్‌లో దశలవారీగా లాగ్ అవుట్‌ను అమలు చేయాలని నిర్ణయించిన పోలీసు శాఖ.. కారిడార్‌ను మూడు భాగాలుగా విభజించింది. ఆయా ప్రాంతాల్లో ఉండే కంపెనీలు ఒకేసారి కాకుండా గంటన్నర వ్యవధిలో దశలవారీగా లాగ్ అవుట్ అమలు చేయడం వల్ల రోడ్లపై వాహనాల సంఖ్య భారీగా తగ్గుతుంది. తద్వారా టెకీలే కాకుండా సాధారణ వాహనదారులు కూడా ఇబ్బంది పడకుండా ఉంటుందని పోలీసు శాఖ భావిస్తున్నది. మంగళవారం ఈ ప్రణాళిక అమలు కాగా.. బుధవారం కూడా అమలు చేయాలని పోలీసు శాఖ ఐటీ, ఐటీఈఎస్ కంపెనీలకు సూచించింది.
రహేజా మైండ్‌స్పేస్‌లో ఉన్న అన్ని కంపెనీలు, టీసీఎస్, హెచ్ఎస్బీసీ, డెల్, మాదాపూర్, కొండాపూర్ ఎవెన్యూలో ఉన్న అన్ని కంపెనీలు, ఒరాకిల్, కాల్కమ్, టెక్ మహీంద్రా, వాటర్ మార్క్, పూర్వ సమ్మిట్‌లో ఉన్న అన్ని కంపెనీలు.
నాలెడ్జ్ సిటీలోని అన్ని కంపెనీలు, నాలెడ్జ్ పార్కులోని అన్ని కంపెనీలు, టీ-హబ్, గలాక్సీ, ఎల్టీఐ, ట్విట్జ్లో ఉన్న కంపెనీలు, కామర్జోమ్, ఆర్ఎంజెడ్ నెక్సిటీ, స్కైవ్యూ (10, 20), దియాశ్రీ ఓరియన్, అసెండాస్ పరిధిలోని అన్ని కంపెనీలు
మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, విప్రో, సెంచారస్, బ్రాడ్వే, విర్చుసా, బీఎస్ఆర్ ఐటీ పార్కు, వేవ్‌రాక్, జీఏఆర్, క్యూ సిటీ, డీఎల్ఎఫ్ పరిధుల్లోని అన్ని కంపెనీలు, ఐసీఐసీఐ, అమెజాన్, హనీవెల్, హిటాచీ, సత్వ క్యాపిటల్, క్యాప్ డెమిన్, ఫ్రాంక్లిన్ టెంప్లిటన్