Hyderabad | సిటీబ్యూరో: నగరంలో ట్రాఫిక్ రద్దీ ప్రతి నిత్యం ఉంటున్నది. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించాల్సిన పోలీసులు ఆయా ప్రధాన కూడళ్లలో తప్పనిసరిగా ఉండాలి. కానీ ఆదివారం వచ్చిందంటే చాలు.. సిగ్నల్స్ వద్ద సిబ్బంది కనిపించడం లేదు. చాలా సందర్భాల్లో ట్రాఫిక్ పోలీసులు తమ విధులు పక్కన పెట్టేస్తున్నారనే విమర్శలొస్తున్నాయి. కేవలం రోజు వారీ చలాన్ల టార్గెట్లు పూర్తి చేసుకోవడం, తమ విధులు పూర్తయ్యాయనే భావనతో ఇంటి ముఖం పట్టడం చేస్తున్న వాళ్లు చాలా మందే ఉన్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అయితే ప్రతి నిత్యం ట్రాఫిక్ రద్దీ ఏర్పడడం, ట్రాఫిక్ సమస్యగా ఉండే కూడళ్ల వద్ద సిబ్బంది ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అయితే ఆదివారం, ఇతర సెలవు దినాలు వచ్చాయంటే ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ పోలీసులు అంతంత మాత్రంగానే పనిచేస్తున్నారు.
ఆదివారం సాయంత్రం 4 గంటల సమయంలో ఎంజే మార్కెట్, గాంధీభవన్, నాంపల్లి కూడళ్లన్నీ బిజీగా ఉన్నాయి. గాంధీభవన్ నుంచి నాంపల్లి జంక్షన్ దాటేందుకు సాధారణ సమయాల్లో ఒకటి రెండు నిమిషాల పట్టే సమయం ఆదివారం పది నుంచి పదిహేను నిమిషాలు పట్టడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ట్రాఫిక్ సిగ్నల్స్ వెలగనప్పుడు తప్పనిసరిగా ఒక ట్రాఫిక్ సిబ్బంది అయినా ఉండాల్సింది. కానీ ఎవరూ లేకపోవడంతో ఎవరికీ వరే అన్నట్లు వాహనాలు వెళ్లడంతో ఇతర ప్రయాణికులు అవస్థలు పడాల్సి వచ్చింది. మరోవైపు బంజారాహిల్స్‌లోని ప్రధాన రోడ్డులోని జంక్షన్ల వద్ద ట్రాఫిక్ పోలీసులు విధులు నిర్వహిస్తూ కనిపించారు.